పాండెమిక్ ట్వీట్స్ తొలగించాలని ట్విట్టర్‌‌కు ఆదేశాలు

by  |
Twitter
X

దిశ, ఫీచర్స్: విపత్కర పరిస్థితుల్లో వాస్తవాల కంటే అసత్య ప్రచారమే ప్రజల్ని ఎక్కువ భయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఏది నమ్మాలో, దేన్ని విస్మరించాలో తెలియని సందిగ్ధత నెలకొంది. జీవోలు, డాక్టర్ పోస్ట్‌లు, కరోనా బాధితుడి దినచర్యలు, ఆక్సిజన్ నిల్వలు, ప్లాస్మా డోనర్ వివరాలు, కరోనా మరణాలు, ఇలా ప్రతి విషయంలోనూ ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయి. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో అనుసరిస్తున్న విధానాలపై కూడా ఇలాంటి అవాస్తవాలు ఎక్కువగా ప్రచారం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కొవిడ్‌కు సంబంధించిన అవాస్తవ ట్వీట్‌లను వెంటనే తొలగించాల్సిందిగా ట్విట్టర్‌ను ఆదేశించింది. దీంతో డజన్ల కొద్దీ ట్వీట్లను ట్విట్టర్ తొలగించింది.

మహమ్మారికి సంబంధించి దేశంలో 52 ట్వీట్లను సెన్సార్ చేయమని తమను కోరుతూ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసిందని ట్విట్టర్ లుమెన్ డేటాబేస్‌లో వెల్లడించింది. ఆర్డర్‌కు అనుగుణంగా.. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ భారత్‌లోని దాని వినియోగదారుల చేసిన పలు ట్వీట్లను నిలిపివేసింది. మీడియానామా నివేదిక ప్రకారం, సెన్సార్ చేసిన ట్వీట్లలో పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి, చిత్రనిర్మాతలు వినోద్ కప్రి, అవినాష్ దాస్, నటుడు వినీత్ కుమార్ సింగ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి మొలోయ్ ఘటక్ పోస్టులు ఉన్నాయి.

‘వాలిడ్ లీగల్ రిక్వెస్ట్ మాకు అందినప్పుడు.. మేము దాన్ని ట్విట్టర్ నియమాలు, స్థానిక చట్టం రెండింటి పరంగా సమీక్షిస్తాం. కంటెంట్ ట్విట్టర్ నియమాలను ఉల్లంఘిస్తే ప్లాట్‌ఫామ్ నుంచి తీసేస్తాం. అయితే ఆ ట్వీట్ ఒక నిర్దిష్ట అధికార పరిధి(భారత చట్టం)లో చట్టవిరుద్ధమై, ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించకపోతే మేము భారతదేశంలో మాత్రమే కంటెంట్‌‌కు యాక్సె‌స్‌ను నిలిపివేస్తాం’ అని ట్విట్టర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా డిలీట్ చేసిన వారి పోస్టులను సెన్సార్ చేయడానికి ముందు ఖాతాదారులందరికీ తెలియజేసినట్లు కంపెనీ ధృవీకరించింది. అన్ని సందర్భాల్లోనూ తాము ఖాతాదారునికి నేరుగా తెలియజేస్తామని ప్రతినిధి చెప్పారు.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ వారు పలు ఫొటోలతో ట్వీట్లు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకే ట్విట్టర్‌కు నోటీసులిచ్చారన్న విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదని.. పాత ఫొటోలు, తప్పుడు సమాచారానికి సంబంధించిన పోస్టులనే బ్లాక్ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశాయి.



Next Story