ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ పరిశ్రమ వృద్ధితో దేశీయంగా లక్షలమందికి ఉపాధి : ఎంఏఐటీ

158

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేసే మార్కెట్ సుమారు 50 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సంపాదించేందుకు సహాయపడనుందని, ఏడాది దాదాపు రూ. 1.49 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చగలదని ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో ఐసీటీ, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల అసోసియేషన్(ఎంఏఐటీ) ప్రకారం.. ఎలక్ట్రానిక్ సబ్-అసెంబ్లింగ్, ఉత్పత్తుల రిపేర్ల పరిశ్రమ సుమారు రూ. 7 లక్షల కోట్లకు పైగా విలువైనది.

‘అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేసేందుకు అక్కడి కార్పొరేట్ కంపెనీలు తక్కువ ఖర్చు, అధిక నైపుణ్యంతో నిర్వహించగల ఇతర దేశాలకు సరఫరా చేసే ప్రయత్నాలను మొదలుపెట్టాయని’ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికా తయారీ సమ్మిట్-2021 కార్యక్రమంలో ఎంఏఐటీ తెలిపింది. ఈ క్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రిపేర్ల కోసం భారత్‌ను హబ్‌గా మార్చే అవకాశముంది. దీనికోసం విధివిధానాలను సరళీకృతం చేయాలని పరిశ్రమ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఎలక్ట్రానిక్స్ రిపేర్ పరిశ్రమ భారత్‌లో ఉపాధికి తోడ్పడనుంది. ప్రభుత్వం నుంచి సరైన సహకారంతో దేశీయ రిపేర్ పరిశ్రమ మెరుగైన ప్రోత్సాహాన్ని పొందగలదని ఎంఏఐటీ అధ్యక్షుడు నితిన్ చెప్పారు.