కరెంట్ ఖాతా మిగులు నమోదయ్యే అవకాశం

by  |
కరెంట్ ఖాతా మిగులు నమోదయ్యే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా మిగులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ చెప్పారు. కొవిడ్-19 నేపథ్యంలో దిగుమతులు భారీగా తగ్గాయని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత కరెంట్ ఖాతా మిగులును నమోదు చేస్తుందన్నారు. అంతర్జాతీయంగా ఉన్న కరోనా ప్రభావం కంటే మన దేశంలో ఉన్న ప్రభావం భిన్నంగా ఉందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1.4 లక్షల కోట్ల కరెంట్ ఖాతా ముగులు ఉందని, తర్వాతి త్రైమాసికాల్లో మెరుగ్గా ఉన్న నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి కరెంట్ ఖాతా మిగులు కనిపించే వీలుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వల్ల తక్కువ కాలంలోనే వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దీర్ఘకాలంలో కరోనా ప్రభావం కొనసాగదని సుబ్రమణియన్ వివరించారు. ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అనేక సంస్కరణలు చేపట్టిందని, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మార్పు, అనుసంధాన ప్రోత్సాహకాలు అన్ని రంగాలకు తోడ్పాటునందిస్తాయని ఆయన వివరించారు.


Next Story

Most Viewed