ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం

by  |
ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. గత నెలలో ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తమ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించమని కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై సుంకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 40 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 30 లక్షల కంటే తక్కువ కలిగిన కార్లపై 60 శాతం వరకు సుంకాలు అమలవుతున్నాయి. దీన్ని 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కార్ల వ్యయం, బీమా, సరుకు రవాణా కలుపుకుని రూ. 30 లక్షల్లోపు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. అదే విధంగా 40 వేల డాలర్లకు పైన అంటే రూ. 30 లక్షలకు పైన ధరల్ ఉన్న కార్లపై ప్రస్తుతం ఉన్న 100 శాతం దిగుమతి సుంకాన్ని 60 శాతానికి తగ్గించాలని కేంద్ర యోచిస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో ఏడాది 30 లక్షల కార్ల అమ్మకాలతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఉంది. ఇప్పుడు విక్రయిస్తున్న కార్లంలో ఎక్కువ వాటా 20 వేల డాలర్లు(రూ. 15 లక్షల్లోపే) ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో ప్రీమియం, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం తగ్గింపు వల్ల సరసమైన ధరల్లో లభ్యమవుతాయి.

తద్వారా అమ్మకాలు పుంజుకుంటాయని ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో టెస్లా చెబుతోంది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా అమ్మకాలపై ప్రభావం ఉంటుందని స్థానిక కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే టాటా మోటార్స్, ఓలా సుంకం తగ్గింపును వ్యతిరేకిస్తున్నాయి. కాగా, ఈ సుంకం తగ్గింపునకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదల అవుతుందని అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed