రేపటినుంచి వన్డే సమరం.. ఆనవాయితీ కొనసాగిస్తారా?

by  |
Ind Vs Eng
X

దిశ, స్పోర్ట్స్: టెస్టులు గెలిచాం.. టీ20 గెలిచాం.. ఇక మిగిలింది వన్డే సమరమే. ప్రపంచ చాంపియన్లు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడటానికి టీమ్ ఇండియా సన్నద్దం అవుతున్నది. సుదీర్ఘ పర్యటనకు వచ్చిన అతిథులు టెస్టులు, టీ20లు కోల్పోయి నిరాశలో ఉన్నారు. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి సగర్వంగా తిరిగి ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ పర్యటనను గమనిస్తే.. టీమ్ ఇండియా తొలి టెస్టు ఓడింది.. కానీ సిరీస్ గెలిచింది. తొలి టీ20 ఓడింది.. కానీ సిరీస్ గెలిచింది. మరి మంగళవారం రోజు ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఇదే ఆనవాయితీ కొనసాగిస్తారా? లేదా విజయంతో వన్డే సిరీస్ ప్రారంభిస్తారా అనేది వేచి చూడాలి.

ఓపెనింగ్ సమస్య..

టీమ్ ఇండియాను వన్డేలో వేధిస్తున్న సమస్య ఓపెనింగ్. గత కొన్ని మ్యాచ్‌లుగా ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడ కోల్పోయాడు. సీనియర్ బ్యాట్స్‌మాన్ అయినా సరే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో ఆ భారం తర్వాత వచ్చే బ్యాట్స్‌మాన్‌పై పడుతున్నది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెన్ చేయడానికి కేఎల్ రాహుల్ సహా యువప్లేయర్లు చాలా మంది వేచి చూస్తున్నారు. అయితే రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును సిద్దం చేస్తున్న సమయంలో శిఖర్ ధావన్‌కు మరొక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. తొలి వన్డేలో రోహిత్‌తో ధావన్ ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు మేనేజ్‌మెంట్ అంటున్నది. వన్డేల్లో ధావన్‌కు క్రీజ్‌లో నిలబడటానికి తగినంత సమయం ఉంటుంది. ఒకసారి కుదురుకుంటే గబ్బర్‌ను ఆపడం ప్రత్యర్థులకు సవాలుగా మారుతుంది.

ధావన్ కనుక వన్డేల్లో రాణిస్తే రాబోయే టీ20 వరల్డ్‌లో స్థానం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాక ఇప్పటికే ఏడాదిన్నర దాటింది. టీ20, టెస్టుల్లో అర్దసెంచరీలు చేసినా వాటిని సెంచరీలుగా మార్చలేకపోతున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో కోహ్లీ ఇబ్బంది పడుతున్నట్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లు గుర్తించారు. అందుకే కోహ్లీ క్రీజ్‌లో ఉంటే ఆదిల్ రషీద్‌ను కెప్టెన్ మోర్గాన్ ప్రయోగిస్తున్నాడు. వన్డే సిరీస్‌లో అయినా కోహ్లీ నుంచి సెంచరీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ టీ20లో విఫలమవడం ఆందోళన కలిగిస్తున్నది. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ కీలకమైన బ్యాట్స్‌మాన్. టాప్ ఆర్డర్ విఫలమైతే జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉన్నది. శ్రేయస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నది.

పటిష్టంగా బౌలింగ్..

ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్ టీ20లో అద్భుతంగా రాణించాడు. వన్డేల్లో కూడా భువీ కీలకమైన బౌలర్‌గా మారనున్నాడు. భువీతో పాటు శార్దుల్ ఠాకూర్ తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నది. ప్రసిధ్ కృష్ణ, నటరాజన్‌లు కూడా కోహ్లీకి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే సీమర్ల కొరత కనిపించడం లేదు. వన్డేల్లో ప్రభావం చూపించే చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కే అవకాశం ఉన్నది. భువీ, శార్దుల్, చాహల్, సుందర్‌లతో పాటు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్నాడు. కాబట్టి భారత జట్టు బౌలింగ్ పటిష్టంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. పూణేలో పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భువీ, శార్దుల్ కీలకంగా మారనున్నారు.

టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా..

ఇంగ్లాండ్ జట్టు రెగ్యులర్ వన్డే ఆటగాళ్లతో కాకుండా టీ20 ప్లేయర్లతో బరిలోకి దిగుతామని ఇప్పటికే స్పష్టం చేసింది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు మ్యాచ్ ప్రాక్టీస్‌గా వన్డే సిరీస్ ఉపయోగించుకుంటామని ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు. జాస్ బట్లర్, జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు ఇయాన్ మోర్గాన్, బెన్‌స్టోక్స్ కూడా సమయానికి తగినట్లు ఆడగలరు. లోయర్ ఆర్డర్‌లో మోయిన్ అలీ కూడా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్నది. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా బలంగా కనపడుతున్నది. ఇక మార్క్‌వుడ్ అత్యంత వేగంతో.. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. టీ20లో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద లోటే. క్రిస్ జోర్డాన్, సామ్ కర్రన్‌లు బౌలర్లుగా నిలకడగా రాణిస్తున్నారు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ స్పిన్నర్లుగా ఎదుటి జట్టుపై ఒత్తిడి తేగలరు. ఈ సిరీస్ ఎలాగైనా గెలిచి టెస్టు, టీ20 ఓటముల నుంచి తేరుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తున్నది.

తుది జట్ల అంచనా..

ఇండియా : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్

ఇంగ్లాండ్ : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాస్ బట్లర్, దావీద్ మలాన్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, టామ్ కర్రన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, క్రిస్ జోర్డాన్

వేదిక : మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలు
లైవ్ : స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్
స్ట్రీమింగ్ : డిస్నీ + హాట్‌స్టార్

Next Story

Most Viewed