‘దిశ’-కథా స్రవంతి పోటీల్లో ప్రోత్సాహాక అవార్డు విన్నింగ్ స్టోరీ.. ‘వంకలు-చంద్రవంకలు’

by  |

ఒక కొత్త కంపెనీలో దేశం నలుమూలల నుంచి చాలా మంది యువతీ యువకులు చేరారు. వారు ఎంతటి పనినైనా చాలా ఉత్సాహంగా, అవలీలగా చేసేసేవారు. ఒక సంవత్సరం తరువాత వారిలో ఉదర సంబంధిత సమస్యలు, అనేక రకాల అనారోగ్యాలు తలెత్తాయి. దీంతో ముందులా పని చేయలేకపోయేవారు. కంపెనీ యజమాని రఘురామ్‌గారు కారణం ఏమిటా అని ఆరా తీశారు. అంతవరకు గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాలలో మంచి సంతులిత ఆహారం తీసుకునే యువతీ యువకులు నగరానికి రాగానే అక్కడ లభించే ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. దాంతోనే గేస్టయిట్రిసు, థైరాయిడ్, లివర్ సంబంధిత వ్యాధులు, ఒబిసిటీ, ఇరిటబులిటీ, యాంగైటీ, రోషంలాంటి మానసిక సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకున్నాయని తేలింది. ఈ పరిస్థితిని నివారించడానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇద్దరిని సెలెక్ట్ చేసారు. ఒకే ఆవరణలో ఉండే నాలుగు కంపెనీలు ఏటా కల్చరల్ ఫెస్ట్ జరుపుతాయి. అందులో ఆటలు, పాటలు, నృత్యాలు, కథల పోటీలు జరుగుతాయి. తిను బండార శాలలు కూడా ఉంటాయి. రఘురామ్‌గారు ఇద్దరు కౌన్సెలర్స్‌ని ఆ ఫెస్ట్‌లో ఫాస్ట్‌ఫుడ్ మీద మాట్లాడమన్నారు. ముందు రూథ్ మాట్లాడుతూ.. ఫాస్ట్‌ఫుడ్ వల్ల వచ్చే నష్టాలను వివరించింది. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ పైన ఫుడ్‌కు వెళ్ళారు. అప్పుడే ఉపన్యాసం విన్నారేమో కొద్దిగా సందేహించినా ఎక్కువ భాగం ఫాస్ట్ ఫుడే తిన్నారు.

తర్వాత రెండవ కౌన్సెలరు లీల ఫాస్ట్‌ఫుడ్‌లో ఉండే పౌష్ఠికాహార సుగుణాలు చెబుతూనే, వాటివలన వచ్చే అనర్ధాలను కూడా వివరించింది. భారతీయ సాంప్రదాయ వంటకాలు, వాటి పౌష్ఠిక విలువలను ప్రస్తావించింది. యువతీ యువకులను ఛలోక్తులతో ఆకర్షించి ‘మీలాంటి అమ్మాయి, అబ్బాయి కథ చెబుతా వింటారా..?’ అంది. ‘ఓ చెప్పండి చెప్పండి’ అన్నారు వారు. చక్కని సూర్యబింబం, అర్ధచంద్రుడు చూడటానికి కనువిందుగా ఉంటాయి కదూ..! అవును అన్నారందరూ.. అటువంటి చంద్రవంకలను గురించిన కథ ఇది. రాజులలో సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు అని ఉన్నారు. సూర్యవంశపు శ్రీరామచంద్రుడు అనే అబ్బాయికి, చంద్ర వంశపు జానకి అనే అమ్మాయికి వివాహం జరిపించాలని మాటలు జరుగుతున్నాయి. వారిద్దరూ సౌందర్యవంతులు, గుణవంతులు, విద్యావంతులు, దయార్దహృదయులు. అన్ని విధాలా సర్వగుణ సంపన్నులు. ఇద్దరికీ వివాహము జరిగితే, అలనాటి సీతారాములకే మాత్రము తీసిపోరని అందరూ అనుకొనేవారు.

ఇది గిట్టనివారు సూర్యవంశపు రాజులు గొప్పా, చంద్రవంశపు రాజులు గొప్పా అనే వివాదాన్ని లేవనెత్తారు. ఇరువైపులా పౌరుషము తలెత్తింది. ఇదేదో తేల్చి తీరాల్సిందే అని కొన్ని పోటీలు పెట్టారు. ఇద్దరూ సరిసమానంగా అన్ని పరీక్షలలోనూ నెగ్గారు. ఇంకేమి చెయ్యాలా అని ఆలోచించి వంటల పోటీలు పెట్టారు. రుచి, ఆకారము, అమర్చే పద్ధతి ఆధారముగా విజేతలను నిర్ణయిస్తారు. సూర్యవంశపు వారు, సూర్యుడిలా గుండ్రముగా ఉండేవి, చంద్రవంశపు వారు చంద్రుడిలా అర్థ చంద్రాకారంలో ఉండేవి చేయాలని నిర్ణయించారు. పదార్థాల తయారీని చూస్తే అన్నీ సమానంగానే ఉన్నా, ఆకారాలలో సూర్యవంశము వారిది పైచేయిగా అన్పించింది. ఎందుకంటే లడ్లు, అప్పాలు, అరిసెలు, బొబ్బట్లు, చేగోడీలు, జంతికలు చాలా మటుకు సూర్యుడిలా గుండ్రము గానే ఉన్నాయి. అర్ధచంద్రుని ఆకారములో వుండే పదార్థాలు తక్కువగా వున్నాయి. ఈ పోటీల మీదే వారి వివాహము అవుతుందా? అవదా అనేది తేలుతుంది. ఈ విషయం శ్రీరామచంద్రుడికి, జానకికి తెలిసింది. అది వారికి చాలా బాధ కలిగించింది.

జానకి విచారంగా ఏమీ తినకుండా పెరటిలో కూర్చొని ఉంది. అక్కడ జీడిపప్పు, బాదము పప్పు, పనస గింజలు ఆరబోసి ఉన్నాయి. వాటితో పాటు పెసరపప్పు కూడా ఎండ బెట్టి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి అమ్మ ప్రభగారు జానకిని ఇడ్లి అయినా తినమని బతిమాలింది. జానకి నేను పూర్తిగా తినలేను. సగమే ఇయ్యి అన్నది. ఆవిడ ఇడ్లీని సగం చేసి ఇచ్చింది. అది అర్థ చంద్రాకారాముగా కనడబింది. అది చూసిన జానకికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. మిగిలిన పిండి వంటలన్నీ సెనగపప్పు, బియ్యపు పిండి, మినపపప్పుతో చేసినవి. తానిప్పుడు కొత్తగా పెసరపప్పుతో తీయని ఇడ్లీలు చేసి సగానికి కోస్తే అర్ధ చంద్రాకారము వస్తుంది అని అమ్మతో అంది. జీడిపప్పుని దీర్ఘముగా చూస్తున్న జానకి చెల్లెలు జాహ్నవి ‘అక్కా అక్కా జీడిపప్పు కూడా అర్ధ చంద్రాకారమే. దానితో తీపి, కారము కూడా చేయవచ్చు’ అంది. అవును బాదం పప్పును కూడా కోస్తే అర్థచంద్రాకారము అవుతుంది’ అంది వారి తల్లి. బాదం పప్పుతో బాదంపాలు తయారుచేస్తే ఇంకా బావుంటుంది అన్నాడు జానకి అన్న. జానకి స్నేహితురాళ్ళు ‘పనస గింజలు ఉడకబెట్టి అర్ధ చంద్రాకారములో కోసి వేయించి ఉప్పు కారము చల్లితే బావుంటుంది’ అన్నారు. పెసరపప్పుతో చంద్రవంకలు, జీడిపప్పు పాకాలు, బాదంకీర్లు, పనస గింజల చంద్రవంకలు, బాదం లడ్లు, పాలతో చంద్రవంక ఆకారములో మిఠాయిలు తయారు చేశారు. అంతే సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు సరిసమానమేనని తేల్చారు. శ్రీరామ చంద్రుడు, జానకి వివాహము వైభవముగా జరిగింది. సూర్యవంశపు రామయ్య అయినా చంద్రవంశపు సీతమ్మ అయినా ఒక్కటే. ఇద్దరూ సరి సమానమే.

నీతి : అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరి సమానమే. జానకి భీమవరము అమ్మాయి, జీడిపప్పు పాకాలకు, బాదంకీరుకు భీమవరము ప్రసిద్ధి. మీరు ఫాస్ట్‌ఫుడ్ అప్పుడప్పుడు తినండి. వాటితోబాటు మన సాంప్రదాయ వంటకాలు కూడా తిని మన సంస్కృతిని నిలబెట్టండి అంది రూథ్. చప్పట్లతో ఆవరణ అంతా మారుమోగింది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత తినుబండారాల శాలలకు వెళ్ళారు. కొద్ది సేపటిలోనే చంద్రవంకలు, సాంప్రదాయ వంటకాల స్టాల్స్ ఖాళీ అయిపోయాయి. ఫాస్ట్‌ ఫుడ్ శాలలు వెలవెలబోయాయి. భారతీయ సంస్కృతి అంటే వస్త్రధారణ, గేయాలు నృత్యాలే కాదు, సాంప్రదాయ వంటకాలు కూడా. భారతీయ ఆహారపు అలవాట్లు పాటిస్తే ఎంతటి మహామ్మారులనైనా ఎదుర్కోగలం అని వివరించింది రూథ్.

బుద్ధవరపు రమణ శ్రీ
-బెంగళూరు
95355 29276

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed