డాక్టర్‌ను కొట్టిన వారిని అరెస్ట్ చేయాలి.. లేదంటే ఓపీ సేవలు బంద్..!

by  |
డాక్టర్‌ను కొట్టిన వారిని అరెస్ట్ చేయాలి.. లేదంటే ఓపీ సేవలు బంద్..!
X

దిశ, జనగామ: పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌పై దాడికి పాల్పడిన వారిని 24 గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లవకుమార్ రెడ్డి హెచ్చరించారు. శనివారం జనగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో స్థానిక లోటస్ హాస్పిటల్‌లో డాక్టర్ లింగమూర్తిపై జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందన్నారు. ప్రాణాలు పోసే వైద్యులపై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు రక్షణగా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి సహకరించాలని కోరారు. వైద్యుడిపై దాడి విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు.

కనీసం ఇప్పటికైనా దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, సరైన చర్యలు చేపట్టకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యుల అసోసియేషన్ సంయుక్తంగా నిరవధికంగా ఓపి సేవల బంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర శాఖ డాక్టర్ కె. అశోక్ రెడ్డి, సీహెచ్ ప్రభు కుమార్, రాష్ట్ర సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సీహెచ్ రాజమౌళి, వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలాజీ, ఐఎంఏ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు వనం శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుగునకర్ రాజు, సర్జన్ డాక్టర్‌ శ్రీకాంత్, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed