హైకోర్టు నోటీసులు పంపినా.. లెక్కచేయడంలే: గణేష్

by  |
ganesh1
X

దిశ, కామారెడ్డి: తెలంగాణ యూనివర్సిటీ అక్రమ నియామకాల విషయం ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతుండగా బిక్కనూర్ సౌత్ క్యాంపస్ లో అక్రమ టీచింగ్ నియామకాలు చేపట్టారని ఓ విద్యార్థి సెల్ఫీ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సౌత్ క్యాంపస్ లో అక్రమ నియామకాలకు సంబంధించిన వివరాలను కర్క గణేష్ ఫిజిక్స్ పరిశోధక విద్యార్థి వీడియో ద్వారా వెల్లడించాడు.

ఆ విద్యార్థి చేసిన ఆరోపణలు అతని మాటల్లోనే.. ‘పార్ట్ టైమ్ టీచింగ్ నియామకం ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో 14-02-2019 రోజున ఒక సెమిస్టర్ కొరకు మాత్రమే వెలువడింది. ఇట్టి నోటిఫికేషన్ కి ఆరుగురు దరఖాస్తు చేశారు. సౌత్ క్యాంపస్ లోనే పార్ట్ టైంలో 2 సంవత్సరాల టీచింగ్ చేసిన నాతో పాటు మరొక స్కాలర్ దేవయ్యకు కూడా ఈ ఇంటర్వ్యూ సమాచారం ఇవ్వలేదు. అప్పటి వీసీ సాంబయ్య తనకు కావాల్సిన వ్యక్తులకు అక్రమంగా పోస్టింగ్స్ ఇచ్చారు. ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ వారిని పార్ట్ టైమ్ టీచర్లుగా నియమించింది.

కానీ, అట్టి నియామకాన్ని పార్ట్ టైంగా కాకుండా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లుగా అప్పటి వీసీ సాంబయ్య 18-03-2019 న పి. సరిత, దిలీప్, శ్రీమాతలను నియమించారు. ఈ నియామకం ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కి ఎటువంటి సంబంధం లేకుండా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాలు ఫీజిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా 2019 నుంచి ఇప్పటివరకు వీసీ, రిజిస్ట్రార్లు ఇస్తునే ఉన్నారు. అట్టి అక్రమ నియామకానికి వ్యతిరేకంగా నేను హైకోర్టులో కేసు వేసి వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు కూడా పంపినాను. కానీ అట్టి నోటీసులకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడం దారుణం. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనలు చేస్తే అక్టోబర్ 31న పాలక మండలి సమావేశంలో ఈ నియామకాలను రద్దు చేశారు. కానీ వీసీ, రిజిస్ట్రార్లు కలిసి పి. సరిత, దిలీప్, శ్రీమాతలను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కొనసాగమని చెప్పడం, బడ్జెట్ కేటాయించడం, ఫిజిక్స్ హెచ్ఓడీ వారిని బెదిరించడం సిగ్గుచేటు.

ఈ నియామకాలు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం. ఇప్పటికైనా అక్రమ నియామకాలను రద్దు చేసి వెంటనే డిపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి. దాని వలన ఎంతోమంది అర్హత కలిగిన నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. యూజీసీ నిబంధనలు పాటిస్తూ మళ్లీ నియామకాలు చేపట్టాలి. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు మెరుగు పడుతుంది. పరిశోధనలో ముందుకు వెళ్తారు. యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుంది’ అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆ నియామకాలను వెంటనే రద్దు చేసి కొత్తగా నియామకాలు చేపట్టాలని గణేష్ డిమాండ్ చేశాడు.


Next Story

Most Viewed