గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీలో అక్రమ నిర్మాణాలు : నటుడు నరేష్

by  |
actor naresh
X

దిశ, శేరిలింగంపల్లి : ఇప్పటికే పూర్తయిన రెసిడెన్సీలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాక జీహెచ్ఎంసీ రూల్స్ కు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలను చేపడుతూ, రెసిడెన్సీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీ సొసైటీ నిర్వాహకుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నటుడు నరేష్. మంగళవారం రాయదుర్గం గ్రీన్ స్టూడియోస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీ నివాసితులతో కలిసి మాట్లాడిన ఆయన.. గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా డీవియేషన్స్ చేస్తూ అపార్ట్మెంట్ లోని 487 ప్లాట్స్ లో ఉంటున్న 1500 మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కామన్ స్పేస్ తో పాటు బాల్కనీలు మూసేసి నిర్మాణాలు సాగిస్తున్నారని, దీనివల్ల 33 అంతస్థుల బిల్డింగ్ పై అదనపు భారం పడి కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. సినీ హీరో కిచ్చా సుదీప్ (కన్నడ హీరో) డీవియేషన్ లో చేపట్టిన నిర్మాణం వల్ల స్లాబ్ కూలిపోయిందని, అయినా మరో ఇద్దరు కూడా ఇదే విధంగా నిర్మాణాలు సాగిస్తున్నారని తెలిపారు. ఓ సెలబ్రెటీ అయి ఉండి నిబంధనలు అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడం ఏంటని నరేశ్ ప్రశ్నించారు. అక్రమ నిర్మాణదారులకు గోల్ఫ్ ఎడ్జ్ అనధికారిక కమిటీ ప్రెసిడెంట్ ప్రీతీశుక్లా, మాధవ్ కోనేరు, సంజయ్ రెడ్డిలు మద్దతు ఇస్తూ ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని, ఈ ముగ్గురు కలిసి మాఫియా మాదిరి సొసైటీని నడిపిస్తున్నారని ఆరోపించారు నటుడు నరేష్. హీరో సుదీప్ ఇతరులు చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, అక్రమాలు ఏమాత్రం ఆగడం లేదన్నారు. గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తాజాగా సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనపై, తన కుటుంబంపై ఇప్పటి వరకు మచ్చలేదని, సంజయ్ రెడ్డి అనే వ్యక్తి సెలబ్రెటీ అయిన తనను బెదిరిస్తూ, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై త్వరలోనే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Next Story

Most Viewed