కలల సౌధాలకు కాలయములై..

by  |
కలల సౌధాలకు కాలయములై..
X

దిశ, కరీంనగర్: ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడాని ఎంతో కష్టపడి, డబ్బులు సంపాదించి ప్లాట్స్ తీసుకుంటారు. రామాయణంలో రావణుడు మాయమాటలు చెప్పి సీతను తీసుకెళ్లినట్టుగా ఈ రియాల్టర్లు సామాన్యులకు మాయమాటలు చెప్పి వారి కష్టాన్ని దోచేసుకుంటున్నారు. సామాన్యుల కలల సౌధాలను నిర్మించుకోవాలనుకుంటే.. రియాల్టర్లు వాటిని కూల్చడానికి కాలయములై కాచుకున్నారు. ఓ వైపున ఇష్టం వచ్చినట్టుగా జరిగిన ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంటే.. అక్కడ మాత్రం రియాల్టర్లు దర్జాగా అమ్మకాలు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ప్లాట్ల వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. డీటీసీపీ అప్రూవల్ లేకుండానే ఏకంగా 6 ఎకరాల్లో ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల గురించి తెలియని సగటు పౌరులు ప్లాట్లను కొని నష్టపోతున్నారు. వరంగల్, కాళేశ్వరం హైవేపై సాగుతున్న ఈ దందాను అడ్డుకునే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 6 ఎకరాల్లో ప్లాట్లు అమ్ముతామంటూ వెంచర్ ఓపెన్ చేశారు రియాల్టర్లు. హైవే పక్కన అమ్మకాలు జరుపుతుండడంతో అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉన్నాయని భావించిన సామాన్యులు తమ కలల సౌధాలు నిర్మించుకునేందుకు ప్లాట్లు కొనుగోలు చేశారు. తీరా గ్రామ పంచాయతీ ఆ స్థలానికి డీటీసీపీ అప్రూవల్ లేదంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో కస్టమర్లు కస్సుబుస్సు మంటున్నారు. లక్షల రూపాయలు పోసి కొన్న తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపున మేడిపల్లి పంచాయతీ గురువారం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ను తొలగించడం గమనార్హం. అనుమతులు తీసుకోకుండానే అమ్మకాలు జరుపుతున్న రియాల్టర్లే బ్యానర్ ను తీసేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాఫియా పనేనా..?

మేడిపల్లి పంచాయతీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వెనక మాఫియా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దందాలో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుని ప్రమేయం కూడా ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. లే అవుట్ అప్రూవల్ లేకుండా ప్లాట్ల అమ్మకాలు జరపడం వెనక రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ అండదండలు ఉన్నాయన్న కారణంగానే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాట్ల అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అనుచరుడు కూడా ఉండటంతో ఆయన ఇష్టానుసారంగా రియల్ వ్యాపారానికి తెరలేపరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కళ్లు మూసుకున్న అధికారులు…

మేడిపల్లి వద్ద 6 ఎకారల్లలో వెంచర్ సిద్దం చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం లేవుట్ లేకుండా ప్లాట్ల అమ్మకాలు కొన్నవారు ఎల్ ఆర్ ఎస్ చెల్లించాల్సిందేనని ఇటీవల ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఇలాంటి ఇబ్బందులు సామాన్యులు ఎదుర్కొవద్దన్న ఆలోచనతో అధికారులు మేడిపల్లి వెంచర్ విషయంలో ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. గ్రామ పంచాయతీ చొరవ తీసుకుని బ్యానర్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికే కొంతమంది అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. డీటీసీపీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి రియాల్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుని వినియోగదారులకు బాసటగా నిలవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed