ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. అడిగేవారు లేరు, అనుమతుల్లేవు..

by  |
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. అడిగేవారు లేరు, అనుమతుల్లేవు..
X

చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్-21 పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇష్టారీతిగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని పలువురు బహాటంగానే చర్చించుకుంటున్నారు. బ్రోకర్లు సైతం అక్రమ నిర్మాణదారుల కోసం పైరవీలు, లాబీయింగ్ చేస్తున్నట్లు వినికిడి. మరోవైపు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూన్నామని గొప్పలు చెబుకుంటున్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులు అప్పజెప్పే అమ్యామ్యాలకు లొంగిపోయి అక్ర నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే వాదన ఉంది. దీంతో అక్రమ నిర్మాణాలు మూడు సైట్లు, ఆరు అంతస్తులుగా కొనసాగుతున్నాయి.

దిశ, గచ్చిబౌలి : సర్కిల్ పరిధిలోని హఫీజ్​పేట్, ప్రకాశ్​నగర్, మదినగూడలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులకు మించి 4-5 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆయా బస్తీలు, కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. భవన యజమానుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందితో ఇంటి యజమానులకు సహకరిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారుల తీరు మారడంలేదు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు.

అధికారుల్లో చలనం శూన్యం..

అభివృద్ధి చెందుతున్న సర్కిళ్లలో చందానగర్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సర్కిల్ రోజురోజుకూ ఎంతో పురోభివృద్ధి చెందుతుంటే అధికారుల ధనదాహంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాల్సిన అధికారులు చలనం లేకుండా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు.

అధికారం.. అహంకారం..

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చందానగర్ సర్కిల్ టీపీఎస్ మధును కలిసి వివరణ కోరగా అక్రమ నిర్మాణాలు తన దృష్టికి రాలేదని, అయినా ఎవరూ కంప్లైంట్ చేయడం లేదని, ఎవరు చెప్పారంటూ రుసరుసలడారు. అడిగితే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని వెటకారంగా సమాధానం ఇచ్చారు.

నేనే పనిష్మెంట్ పై వచ్చా ..

అక్రమ నిర్మాణాల విషయమై చందానగర్ సర్కిల్ సిటీ ప్లానర్ సంపత్ ను కలిస్తే తాను పనిష్మెంట్ పై వచ్చానని, రూరల్​లో పని చేస్తున్న తనకు జీహెచ్ఎంసీలో పనిష్మెంట్ పై బదిలీ చేశారని చెప్పుకొచ్చారు. సదరు నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని దాటవేశారు.



Next Story

Most Viewed