మీకో విషయం తెలుసా..? శంషాబాద్‌లో..

by  |
మీకో విషయం తెలుసా..? శంషాబాద్‌లో..
X

దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 111ని తుంగలో తొక్కి ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణాల అనుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే విమానాశ్రయం రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు నిర్మించడంతో సంపన్న వర్గాలు బహుళ అంతస్తుల నిర్మాణాలకు తెరలేపారు. కనుల ముందే నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా.. మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు.

అటకెక్కిన 111 జీఓ

నగర ప్రజలకు తాగు నీరందిస్తున్న జంట జలాశయాలు కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా 1996లో జీవో నెంబర్ 111 ను అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే జీవో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. శంషాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా 8 నుంచి 9 అంతస్తుల భవనాలు నిర్మితమవుతున్నాయంటే.. అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇండ్ల మధ్య భారీ సెల్లార్లు

అధికారుల ఉదాసీనతతో అక్రమ నిర్మాణదారులు మరో అడుగు ముందుకేశారు. ఇళ్ల మధ్య భూగర్భ కట్టడాలకు తెరలేపారు. బెంగళూరు జాతీయ రహదారి శంషాబాద్ నుంచి షాబాద్ రహదారులకు ఆనుకొని ఇళ్ల మధ్యనే సెలార్ల కోసం గుంతలు తవ్వారు. అనుమతి లేకపోవడంతో త్వరగా పనులు పూర్తి చేయాలని కూలీలను పరుగులు పెట్టిస్తున్నారు. మధురానగర్, ఆర్భీ నగర్, ఉట్ పల్లి, రాళ్లగూడ, తొండుపల్లి, ఆదర్శనగర్, సామా ఎన్ క్యూవ్, కాలనీల్లో సెల్లార్లతో కూడిన భారీ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జీ ప్లస్ టు కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే విధిగా హెచ్ఎండీఏ అనుమతులు తప్పక తీసుకోవాల్సి ఉన్నా అవేమీ పట్టింకోకుండా ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మితమవుతున్నాయి.

అధికారులతో వాగ్వాదం

ఇటీవల అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన అధికారులను యజమానులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. మేము గతంలో గ్రామపంచాయతీలో అనుమతులు తీసుకున్నామని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ ఘర్షణ పడ్డారు. అయితే శంషాబాద్ లో 111 జీఓ పరిధిలో ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి వీలులేదని ఇంతకు ముందు అనుమతులు ఇచ్చారని చెప్పిన అవే చెల్లుబాటు కావని మున్సిపల్ అధికారులు చెప్పడంతో నిర్మాణదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు: రామచందర్​, పట్టణ ప్రణాళిక అధికారి

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీవో అమల్లో ఉన్నందున ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయలేదు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిధిలో 150 కిపైగా అక్రమ నిర్మాణాలు 16 వెంచర్లు గుర్తించి వారికి నోటీసులు అందజేశాం. ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తప్పవు. పాత తేదీల్లో గ్రామపంచాయతీ అనుమతులు తీసుకున్నా అవి చెల్లుబాటు కావు.



Next Story