కొంపల్లిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

by  |
కొంపల్లిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
X

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అన్నీ తెలిసినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మామూళ్ల మత్తులో అక్రమార్కులకు కొందరు అధికారులు వంతపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కళ్లముందటే గోదాములు, బహుళ అంతస్తులు వెలుస్తున్నా పట్టణ ప్రణాళికా విభాగం అటు వైపు కన్నెతిచూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

దిశ, కుత్బుల్లాపూర్: కొంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ సినీప్లానెట్ వెనుకాల కేవీఆర్ గార్డెన్స్ వద్ద రోడ్డుకు సెట్ బ్యాక్ లేకుండా మడిగల నిర్మాణం చేపట్టారు. వాటికి ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. రాయల్ పార్క్ వద్ద మడిగల నిర్మాణంతో పాటు భారీ గోదామును సైతం నిర్మిస్తున్నారు. రెండస్తుల భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని చిన్న పెంట్ హౌస్ నిర్మించినా కూల్చివేసే అధికారులు ఇప్పుడు ఎక్కడికి పోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మామూళ్లు దండుకుని అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.

నేతల అండదండలతోనే..

కొంపల్లి మున్సిపాలిటీలో చాలా వరకు ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సమాచారం. అధికారులెవరైనా అనుమతి తీసుకోవాలని సూచిస్తే ‘ మా నాయకుడికి చెప్పాం. మాకు మీ అనుమతులు అవసరంలేదు’ అని బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

అనుమతివ్వలేదు..

నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాను. నేనొచ్చాక ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఒకసారి విచా రణ జరిపి అక్రమ నిర్మాణమైతే చర్యలు తీసుకుంటా. అక్రమ నిర్మా ణాలు చట్టరిత్యానేరం. విచారణలో అక్రమ నిర్మాణాలుగా తేలితే కూల్చివేస్తాం. తప్పనిసరిగా అనుమతులు లభించాకనే నిర్మాణలు చేపట్టాలి. భవన నిర్మాణదారులు నిర్లక్ష్యం వహించడం తగదు.

–రాధాకృష్ణ, పట్టణ ప్రణాళికా అధికారి

Next Story

Most Viewed