జోధ్‌పూర్ ఎయిమ్స్ వైద్యుల వినూత్న ఆవిష్కరణ.. చేతులు మాట్లాడుతున్నాయ్!

by  |
జోధ్‌పూర్ ఎయిమ్స్ వైద్యుల వినూత్న ఆవిష్కరణ.. చేతులు మాట్లాడుతున్నాయ్!
X

దిశ, ఫీచర్స్ : సృష్టిలో ప్రతీ జీవి మరో జీవితో కమ్యూనికేట్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆ కమ్యూనికేషన్ ‘మాటే’ కానక్కర్లేదు. పక్షులు పలికే ధ్వనులు, చీమలు వదిలే రసాయనాలు, పువ్వులు వెదజల్లే పరిమళాలైనా కావచ్చు. అంతెందుకు మౌనం మాట్లాడుతుంది. చూపులు సంభాషిస్తాయి. స్పర్శ సైతం సందేశాన్ని చేరవేస్తుంది. ఒక విషయాన్ని మనుషులకు లేదా ఇతర జీవులకు చేరవేసే రూపాలు వేరేమో కానీ సమాచారం చేరవేయడం మాత్రం కామన్. ఇదిలా ఉంటే.. సాంకేతికత పెరిగే కొద్దీ ప్రతికూలంగా ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరించుకుంటూ, అందుకు తగ్గ పరికరాలు సృష్టించుకుంటున్నాం. ఈ క్రమంలోనే పలు వైకల్యాలకు లేదా బలహీనతలకు సంబంధించిన లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్స్, డివైజెస్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి కొనసాగింపుగా ‘స్పీచ్ డిజబిలిటీ’ గల వ్యక్తుల మధ్య సంభాషణలను సులభతరం చేసేందుకు జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)కు చెందిన వైద్యులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీర్లతో కలిసి ‘టాకింగ్ గ్లోవ్స్’ అభివృద్ధి చేశారు.

‘స్పీచ్, లాంగ్వేజ్’.. నిజానికి ఈ రెండు పదాలు భిన్నమైనవి. కానీ వీటిని ఒకేపదంగా వాడుతుంటాం. స్పీచ్ అంటే మాట్లాడటం.. ఇది దవడ కండరాలు, నాలుక, పెదవులు, స్వర తంతువులను ఉపయోగిస్తూ పలికే ధ్వని. భాష అనేది సందేశాన్ని కమ్యూనికేట్ చేసేందుకు ఉపయోగించే పదాలు లేదా సంకేతాల సమితి. స్పీచ్, లాంగ్వేజ్ డిజబిలిటీస్ విడిగా లేదా రెండూ ఒకే సమయంలో సంభవించవచ్చు. అయితే ఈ రెండు సమస్యలు గల వ్యక్తుల మధ్య సంభాషణల్ని సులభతరం చేసేందుకు జోధ్‌పూర్ ఎయిమ్స్ వైద్యులు ‘టాకింగ్ గ్లోవ్స్’ రూపొందించారు. ప్రసంగ వైకల్యం ఉన్న వ్యక్తి చేతి సంజ్ఞలను టెక్స్ట్‌గా లేదా ముందే రికార్డ్ చేసిన వాయిస్‌గా మార్చేందుకు ఈ డివైజ్ సాయపడటంతో పాటు ఆ వ్యక్తి తన సందేశాన్ని స్వతంత్రంగా కమ్యూనికేట్ చేసేందుకు తోడ్పడుతుంది. కృత్రిమ మేధస్సు(AI), మెషిన్ లెర్నింగ్(ML) సూత్రాలను ఉపయోగించి తయారుచేసిన ఈ పరికరం కేవలం రూ. 5,000 కంటే తక్కువ ధరతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఆవిష్కరణకు గాను వాళ్లు పేటెంట్ హక్కు కూడా పొందారు.

ప్రేరణ :

స్వర సామర్థ్యం కోల్పోయి బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో.. వాళ్లు అనుభవించే బాధను ఎయిమ్స్ డాక్టర్లు అమిత్ గోయల్, అభినవ్ దీక్షిత్‌ స్వయంగా చూశారు. స్పీచ్ రిహాబిలిటేషన్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ కాగా, ఆ సమయంలో సదరు వ్యక్తి ఎన్నోసార్లు ఒత్తిడికి గురవడాన్ని గమనించారు. దీని సక్సెస్ రేటు కూడా 33 శాతం కంటే తక్కువగా ఉంది. అదేవిధంగా డిజిటల్ పరికరాల్లో వాయిస్ క్లారిటీ లేకపోవడం, ఇప్పటికే ఉన్న పద్ధతులు అంతగా ప్రజాదరణ పొందకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఓ ఉత్తమ డివైజ్ రూపొందించాలని అమిత్, అభినవ్ డిసైడ్ అయ్యారు. అలా IIT జోధ్‌పూర్ ప్రొఫెసర్స్ సుమిత్ కల్రా, ప్రొఫెసర్ అర్పిత్ ఖడేల్‌వాల్‌తో కలిసి అక్టోబర్ 2018లో అందుకు సాధ్యమయ్యే పరిష్కారాలను చర్చించారు. ఆ మేధోమథనం నుంచి పుట్టుకొచ్చిన పరికరమే ‘టాకింగ్ గ్లోవ్స్’.

ఏ భాషనైనా మాట్లాడవచ్చు..

ఏఐ, ఎమ్‌ఎల్ సాంకేతికత ద్వారా రెండు చేతుల నుంచి వేళ్ల కదలికలు ఫొనెటిక్ సిలబుల్స్‌కు మ్యాప్ చేసేందుకు వినియోగింపబడతాయి. ఆ తర్వాత ధ్వనిని ఉత్పత్తి చేసేందుకు స్పీచ్ జనరేషన్ మాడ్యూల్‌కు ఇన్‌పుట్‌ చేస్తాయి. స్పీచ్ జనరేషన్ మాడ్యూల్‌ను వినియోగదారు ప్రాధాన్యత ఆధారంగా యాసను ఎంచుకోవడానికి అనుకూలీకరించవచ్చు. ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉండే సాధారణ గ్లోవ్స్ ఉపయోగించగా, వాటిపై తేలికైన సెన్సార్స్ అమర్చాం. ప్రస్తుత స్పీచ్ ఉత్పత్తి చేసే డివైజెస్ సింబాలిక్ లేదా భాషపై ఆధారపడి ఉంటాయి. సింబాలిక్ పద్ధతులకు వాటి పరిధికి సంబంధించి పరిమితులున్నాయి. అవి భాష-ఆధారిత పద్ధతుల ద్వారా మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ప్రతిపాదిత పద్ధతిలో అటువంటి పరిమితులు లేకుండా ఏవేని పదాల కలయికతో ఏ భాషనైనా మాట్లాడవచ్చు. ఈ డివైజ్ IIT జోధ్‌పూర్ ఇంక్యుబేట్ చేసిన స్టార్టప్ మార్కెట్‌లోకి తీసుకొస్తాం. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. 2022 చివరి నాటికి లాంచ్ చేసే అవకాశముంది.
– అమిత్, అభినవ్ వైద్యులు

ఒరిజినల్ వాయిస్‌ను ఉత్పత్తి చేయొచ్చు..

ఎటువంటి భాషా అవరోధం లేకుండా ప్రజలు తమ భావాలను స్వతంత్రంగా వ్యక్తీకరించేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేయాలనుకునేవారు డివైస్ పనితీరును ఒకసారి తెలుసుకుంటే చాలు. తమ పరిజ్ఞానంతో ఏ భాషలోనైనా మౌఖికంగా సంభాషించగలరు. అంతేకాదు సహజత్వం కోసం బాధితులు తమ ఒరిజినల్ వాయిస్‌ను పోలిన వాయిస్‌ను ఉత్పత్తి చేసేందుకు పరికరాన్ని అనుకూలీకరించవచ్చు. మొదటి నమూనాను అభివృద్ధి చేసి, సాధ్యతను ప్రదర్శించేందుకు ఎనిమిది నెలలు పట్టింది.
– ప్రొఫెసర్ సుమిత్ కల్రా

Next Story

Most Viewed