ధాన్యం కొనకుంటే దండోరా మోగిస్తాం : తమ్మినేని వీరభద్రం

by  |
Julakanti Rangareddy
X

దిశ, హుజూర్‌నగర్: యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులు దండోరా మోగిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో రెండవ రోజు కొనసాగిన పార్టీ జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఖరీదు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షం, రైతు సంఘాలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్నారు.

కార్పొరేట్ స్థానంలో ప్రత్యామ్నాయ విధానాలు చూపేది కమ్యునిస్టులే అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జిల్లాలో నాటి నుండి నేటి వరకు ముఖ్యంగా శ్రీరాంసాగర్ రెండవ దశ నిర్మాణం, మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణ, నాగార్జునసాగర్ ఎడమ కాలువలపై లిఫ్ట్ ఇరిగేషన్ల
నిర్మాణం, పరిశ్రమల నిర్మాణం లాంటి సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించిన ఘనత సీపీఎంకే దక్కిందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభలో చర్చించి పార్టీ రాజకీయ తీర్మానం చేసింది. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి, పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ-పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ లాంటి అనేక హామీలలో ఏ ఒక్కటి అమలుకాలేదని ఎద్దేవా చేశారు.

జిల్లా అభివృద్ధికి భౌగోళికంగా అన్ని అవకాశాలు ఉన్నా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ క్రస్టు గేట్ల ఆధునీకరణ, చానల్ కెనాల్స్ అభివృద్ధి, డిస్ట్రిబ్యూటర్స్ షెటర్లను నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన కాలువలు కంప చెట్లతో నిండిపోవడంతో చివరి భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో పెరుగుతున్న కౌలు రైతులకు విత్తనాలు, పురుగుమందులతో పాటు బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రతి 5000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు జీవిత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలల్లో
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి మెరుగుపర్చాలి కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న పోడుభూములను సాగుచేసుకుంటున్న రైతులకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. విజయవాడ నుండి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వరకు, మిర్యాలగూడెం నుండి సూర్యాపేట మీదుగా ఖాజీపేట
వరకు రైల్వేలైనును వేయాలన్నారు. సభలోరాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, ములకలపల్లి రాములు, ధీరావత్ రవినాయక్, బుర్రి శ్రీరాములు, కొలశెట్టి యాదగిరి, నెమ్మాది వెంకటేశ్వర్లు, చెరుకు ఏకలక్ష్మీ, జిల్లా కమిటీ సభ్యులు నాగారపు పాండు, యాకూబ్, కందగట్ల అనంత ప్రకాష్, భూక్యా పాండునాయక్, పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, సీతయ్య, వీరమల్లు, పార్టీ నాయకులు‌ పాల్గొన్నారు.

Next Story

Most Viewed