ఐసీఎల్ ఫాస్ట్ బౌలర్.. హుజురాబాద్ పాలిటిక్స్‌లో బోల్తా పడుతున్నారు..

by  |
Congress-Kaushik-Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇండియన్ క్రికెట్ లీగ్‌(ఐసీఎల్‌)లో ఫాస్ట్ బౌలర్.. వీణవంక ఎక్స్‌ప్రెస్‌గా ముద్రపడ్డ ఆయన రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారా..? బౌలింగ్ చేసేప్పుడు ఉన్న దూకుడే రాజకీయాల్లోనూ ప్రదర్శిస్తుండటమే ఆయనను నెగిటివ్‌గా మారిందా.. అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు. రాహుల్ గాంధీ రథ సారథిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు సొంత పార్టీ నుంచే షోకాజ్ నోటీస్ అందుకునే పరిస్థితికి చేరడానికి కారణాలేంటీ?

వీణవంకకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి.. కపిల్ దేవ్ సారథ్యంలో ఏర్పాటైన ఇండియన్ క్రికెట్ లీగ్‌కు ఫాస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఐసీఎల్‌కు బీసీసీఐ బ్రేకులు వేసింది. దీంతో, అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా చాటుకునే అవకాశం దక్కకుండా పోయింది. అయితే, టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమర్ రెడ్డి నియామకం అయిన తరువాత క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన కౌశిక్ రెడ్డి ప్రజా క్షేత్రంలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. 2018 ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటలపై పోటీ చేసి 61 వేల ఓట్లు సాధించుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఈటలకు గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరే ప్రచారం జరిగినప్పటికీ.. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన వ్యవహరశైలిని తేటతెల్లం చేశాయి. దీంతో ప్రజల్లో ఆయన క్లీన్ బౌల్డ్ అయ్యాడనే చెప్పాలి.

కేటీఆర్ మీటింగ్..

హైదరాబాద్‌లో పరామర్శించేందుకు వెళ్లినప్పుడు అక్కడికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా వచ్చారు. కేటీఆర్.. వాహనం ఎక్కేందుకు వెళ్లినప్పుడు కారు డోర్ వద్దకు వెళ్లి మరీ ఆయన చెవిలో గుసగుసలాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. తాను కేటీఆర్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని, నా స్నేహితుడి ఇంటి వద్ద కలిసినప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. అదే రోజు ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చెవిలో ఏం చెప్పారో చెప్పాలని అడగగా.. బై పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్నానని అన్నారు.

ఓపెన్‌గా మాట్లాడాల్సిన ఈ విషయాన్ని అంత సీక్రెట్‌గా చెప్పడం ఎందుకు అన్న చర్చ కూడా సాగింది. అప్పటికే హుజురాబాద్‌లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తన సన్నిహిత ఎమ్మెల్యే ఒకరితో రాయబారం నడిపారని కూడా ప్రచారంలో ఉంది. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే టీఆర్ఎస్‌లో చేరుతారన్న సంకేతాలు ఆ ఎమ్మెల్యే ద్వారా అధిష్టానం పెద్దలకు కౌశిక్ రెడ్డి పంపించారని కాంగ్రెస్‌లోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఏప్రిల్ 30న ఈటల భూ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా స్పందించారు.

ప్రతిపక్ష పార్టీలన్ని సీఎం కేసీఆర్ వైఖరిని తప్పు పడుతుంటే కౌశిక్ రెడ్డి మాత్రం ఈటలను నిలదీసే కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. దీంతో, అప్పుడే కౌశిక్ చూపులు గులాబీ వైపు పడ్డాయా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారూ లేకపోలేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోదరుడు కావడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు లేవని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అంతేకాకుండా సొంత నియోజకవర్గంలో కూడా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు జట్టు కట్టారు. ఈ వ్యవహారం కాస్తా పీసీసీ క్రమ శిక్షణా కమిటీ వరకు వెళ్లడంతో హుజురాబాద్ నాయకులను కమిటీ పిలిపించి మందలించింది.

రేవంత్ ఎంట్రీ తర్వాత..

పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత కౌశిక్ రెడ్డి భవితవ్యం ఏంటీ.? అన్న చర్చే ఎక్కువ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ బై పోల్స్ గురించి ఎంత మేర అయితే చర్చ సాగిందో.. కాంగ్రెస్ పార్టీలో అంతే స్థాయిలో కౌశిక్ ఎపిసోడ్ గురించి డిస్కషన్ అయింది. అయితే, అందరికీ షాక్ ఇస్తూ రేవంత్ రెడ్డిని కలిసిన కౌశిక్ శుభాకాంక్షలు తెలియజేయడంతో అంతా సద్దుమణిగిందని భావించారు. కానీ, ఆ తరువాత కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో రహస్యంగా మంతనాలు జరిపారని, ఇందులో భాగంగానే ఆయన తన అనుచరులను ముందుగా టీఆర్ఎస్‌లో జాయిన్ చేయించారని కూడా అంతా అనుకున్నారు.

ఇంత జరుగుతున్నా తాను మాత్రం టీఆర్ఎస్‌లో చేరనని వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని ఘంటాపథంగా చెప్తూ వచ్చారు. తాజాగా ఓ నాయకుడితో కౌశిక్ మాట్లాడిన ఆడియో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నానని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పీసీసీ పెద్దలకు మింగుడుపడకుండా చేశాయి. దీంతో సంజాయిషీ ఇవ్వాలని పీసీసీ కౌశిక్‌కు నోటీసులు ఇచ్చింది.

ముందుగానే ముహుర్తం..?

కౌశిక్ రెడ్డి ఈ నెల 14న కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో చేరేవారని అంటున్నవారూ లేకపోలేదు. ఇప్పటికే తన నియోజకవర్గానికి చెందిన పలువురితో చర్చలు జరిపిన ఆయన 500 భారీ కాన్వాయ్‌తో టీఆర్ఎస్‌లో చేరాలని గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని అంటున్నారు హుజురాబాద్ ప్రాంత నాయకులు. అయితే, ఉన్నట్టుండి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కావడంతో ఆయన తన నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Next Story