క్రికెట్ మనుగడకు ఐసీసీ ప్లానింగ్ !

by  |
క్రికెట్ మనుగడకు ఐసీసీ ప్లానింగ్ !
X

భారత్‌లో క్రికెట్‌‌ను ఓ మతంలా ఆరాధించే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్‌లో అయితే దేశమంతటా క్రికెట్ ఫీవర్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కరోనా కారణంగా.. బీసీసీఐకి కాసులు కురిపించే ఐపీఎల్‌ను సైతం వాయిదావేయక తప్పలేదు. ఇదేకాక ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే చాలా సిరీస్‌లు రద్దయ్యాయి. దీంతో బీసీసీఐతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచానికి దిక్సూచి అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్నేండ్లుగా క్రికెట్ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది.

ఐసీసీలో మొత్తం 104 సభ్య దేశాలు ఉండగా.. వీటిలో 12 దేశాలు మాత్రమే పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. మిగిలిన 90 దేశాలు అసోసియేట్ సభ్యు దేశాలే. అయితే క్రికెట్‌ను ఫుట్‌బాల్ స్థాయిలో మరింత అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పూర్తి స్థాయి సభ్య దేశాలను తయారు చేయాలని ఐసీసీ గత కొన్నేండ్లుగా ప్రయాత్నాలు చేస్తూనే ఉంది. వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అనుకోని అవాంతరం ఏర్పడింది. క్రికెట్ అనే కాదు.. క్రీడా ప్రపంచమే నిలిచిపోయేలా చేసింది. కరోనా దెబ్బకు ఇప్పుడిప్పుడే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్న వాళ్లు, క్రికెట్ ఆటపై ఆసక్తి కనబరుస్తున్న దేశాలు ఒక్కసారిగా పునరాలోచనలో పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగక ఐదు వారాలు దాటి పోయింది. మార్చి 13న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రేక్షకులు లేకుండా జరిగిన వన్డే మ్యాచే ఆఖరు. మళ్లీ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాబోయే కాలంలో ప్రపంచం, మనుషుల మనస్థత్వాలు మునుపటిలా ఉండవని.. కచ్చితంగా క్రీడలు, వినోదానికి వెచ్చించే సమయం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఐసీసీ కూడా క్రికెట్ మనుగడ ఏ విధంగా కొనసాగించాలన్న విషయంలో మదనపడుతోంది.

కరోనా కారణంగా ఎదురవుతున్న నష్టాల కారణంగా.. ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో పాటు క్రీడాకారుల్లోనూ భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది. ఇక ఈ సమయంలో అందరిలో భరోసా నింపాల్సిన బాధ్యత ఐసీసీపై పడింది. అందుకే ఈ గురువారం (23 మార్చి) ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. 12 శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్ దేశాలకు చెందిన సీఈవోలు, అధ్యక్షులు ఆన్‌లైన్ ద్వారా సమావేశం కానున్నారు. క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. వచ్చే ఏడాది ముగియాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు కరోనా కారణంగా అడ్డుకట్ట పడింది. దాని కొనసాగింపుగా.. పలు ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణతో పాటు గతంలో ప్రతిపాదించిన వన్డే సూపర్ లీగ్ విషయమూ ఈ సమావేశంలో చర్చకు రానుంది. అంతేకాకుండా ఆగిపోయిన సిరీస్‌లను రద్దు చేయాలా లేక కొత్త తేదీల్లో కొనసాగించాలా అనే దానిపైనా ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌ నిర్వహణపైనా ఐసీసీ మిగతా బోర్డులతో చర్చ జరపనుంది.

ప్రస్తుతం కరోనా కారణంగా నష్టపోయిన క్రికెట్‌ రంగాన్ని కాపాడుకోవడమే ఐసీసీతో పాటు అన్ని దేశాల బోర్డుల ముందున్న తక్షణ కర్తవ్యం. కాబట్టి పలు దేశాల బోర్డులు కొన్ని రోజుల పాటు సొంత అజెండాల అమలును పక్కనబెట్టి క్రికెట్‌ను బతికించాలనే లక్ష్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఐసీసీ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా క్లిష్ట సమయం.. ప్రతీ క్రీడను కాపాడాలి.. నిరంతర సాధన లేకుంటే క్రీడాకారులు కూడా ఆటపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉన్నందున.. సాధ్యమైనంత త్వరగా క్రికెట్‌ను పట్టాలకెక్కించాలని ఐసీసీ భావిస్తున్నట్లు’ ఆయన స్పష్టం చేశారు.

Tags: ICC, BCCI, Cricket Associate countries, survive, WT20

Next Story

Most Viewed