'హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల ఉపయోగం లేదు'

by  |
హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల ఉపయోగం లేదు
X

వాషింగ్టన్ : కరోనా సోకిన రోగులకు మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను ఇవ్వడం వల్ల రోగం నయమవుతుందన్న కొన్ని విశ్వాసాలున్నాయి. పలువురు వైద్య నిపుణులతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ సమర్థవంతంగా పని చేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో ఈ డ్రగ్ కొవిడ్-19పై ఎలాంటి ప్రభావాన్ని చూపదని.. దీని వల్ల వ్యాధి నయం కాదని తేల్చేసింది. అమెరికాకు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ, మెడికల్ పబ్లిషర్ బీఎంజే, యేల్ యూనివర్సిటీలు సంయుక్తంగా నడిపిస్తున్న ‘మెడ్ ఆఎక్స్‌వీ’ అనే సైట్ ఈ సంచలన విషయాలు వెల్లడించింది. అధికారికంగా బయటకు రాని మెడికల్ జర్నల్స్, రిపోర్ట్స్, సర్వేలను ఈ సైట్ పబ్లిష్ చేస్తుంటుంది. కాగా, కరోనా బారిన పడి మరణించిన మరియు డిశ్చార్జ్ అయిన 368 మంది సీనియర్ సిటిజన్ల మెడికల్ రిపోర్టులు పరిశీలించి ఒక పరిశోధనా పత్రాన్ని రూపొందించారు. ఈ పత్రం ప్రకారం.. హైడ్రాక్సీక్లోరోక్వీన్ తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం, అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ డ్రగ్ తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా ఉన్నట్లు తేలింది. కాగా.. ప్రామాణికంగా చేసిన వైద్యం పొందిన వాళ్లలో 11 శాతం మంది మాత్రమే మరణించినట్లు తేలింది. ఎంతో మంది మలేరియా డ్రగ్ గురించి ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండానే కరోనాపై మంచిగా పోరాడుతుందని చెప్పారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్డ్ కూడా హైడ్రాక్సీక్లోరోక్వీన్ డ్రగ్‌ను కాంబినేషన్‌లో వాడితే సమర్థవంతంగా పోరాడుతుందని చెప్పారు. దీంతో ప్రపంచదేశాల్లో ఈ డ్రగ్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఇండియా నుంచే ఎన్నో దేశాలు ఈ మాత్రలను దిగుమతి చేసుకున్నాయి. కాని ఈ రిపోర్టు కొత్త విషయాలు చెబుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఈ అధ్యయనం కోసం వాడిన శాంపిల్స్ పేషెంట్లు అందరూ అప్పటికే డయాబెటిస్, హై బీపీ వంటి వ్యాదులతో బాధపడుతున్న వాళ్లేనని.. అందుకే కంగారు పడొద్దని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Tags: hydroxychloroquine, donald trump, america, not, useful



Next Story

Most Viewed