గ్రేటర్‌లో హంగ్.. హైదరా'బాద్'షా ఎవరు?

by  |
గ్రేటర్‌లో హంగ్.. హైదరాబాద్షా ఎవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఊహకు అందని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు తీసుకున్నా మేయర్ సీటును కైవసం చేసుకోవడం ఏ పార్టీకీ సాధ్యం కాలేదు. ఊహకు అందని విధంగా ‘హంగ్’ పరిస్థితి తలెత్తింది. అధికార టీఆర్ఎస్, మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్, ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తీరులో త్రిముఖ పోటీ జరిగింది. కానీ ఏ పార్టీ కూడా స్వతంత్రంగా మేయర్ స్థానాన్ని చేజిక్కించుకునేంత సంఖ్యలో గెలవలేకపోయాయి. అన్న డివిజన్ల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించినా నేరెడ్‌మెట్ ఫలితాన్ని మాత్రం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపులో వచ్చిన తేడాలపై బీజేపీ అభ్యర్థి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వస్తిక్ ముద్ర కంటే ఇతర ముద్రలు వేసిన బ్యాలట్ పేపర్లు ఎక్కువగా ఉన్నందు హైకోర్టు ఆదేశం వచ్చేంతవరకూ ఫలితాన్ని వెల్లడించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 99 స్థానాలను కైవశం చేసుకున్నా ఈసారి మాత్రం కేవలం 56 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా 48 స్థానాలు గెల్చుకుంది. మజ్లిస్ మాత్రం గత ఎన్నికల్లో 44 చోట్ల గెలిస్తే ఈసారి ఒక సీటును కోల్పోయింది. కాంగ్రెస్ గతంలోలాగానే రెండు స్థానాలకే పరిమితమైంది. ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపొందలేదు. తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, వామపక్షాలు డిపాజిట్ సైతం కోల్పోయాయి.

మొత్తం 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సెంచరీ అని టార్గెట్ పెట్టుకున్నా కనీసం మ్యాజిక్ ఫిగర్ 76కు కూడా టీఆర్ఎస్ చేరుకోలేకపోయింది. హైదరాబాద్ నగరానికి ఐదేళ్ళలో ప్రభుత్వం చేసిన రూ. 67 వేల కోట్ల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, పది వేల రూపాయల వరదసాయం లాంటివన్నీ అధికార పార్టీని గెలిపించలేకపోయాయి. మేయర్ పదవికి ఎక్స్ ఆఫీషియో సభ్యుల మద్దతు తీసుకున్నా దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మజ్లిస్ మద్దతు తీసుకోవడమా లేదా అనేదానిపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. మేయర్ పదవిని చేజిక్కించుకోవడం కోసం ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయి. మజ్లిస్‌తో అంటకాగుతోందంటో టీఆర్ఎస్‌పై విపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలో తిరిగి ఆ పార్టీ మద్దతు కోరడానికి కేసీఆర్ సుముఖంగా లేనట్లు సమాచారం.

భావోద్వేగాల ప్రచారం..

గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో మత అంశాల ప్రాతిపదికగా ఎన్నికల ప్రచారం భావోద్వేగాల నడుమ సాగింది. పార్లమెంటు ఎన్నికలకు తీసిపోని తీరులో ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకు ప్రచారం జరిగింది. అధికార పార్టీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రిని, మొత్తం 150 డివిజన్లకు ఒక్కో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఇన్‌ఛార్జిలుగా నియమించింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. మజ్లిస్ తరఫున ఒవైసీ బ్రదర్స్, కాంగ్రెస్ తరఫున రాష్ట్ర స్థాయి నాయకులంతా ప్రచారం చేశారు. హిందు-ముస్లిం మతాలు ప్రచారంలో ప్రధాన భూమిక పోషించాయి.

పాత బస్తీపై సర్జికల్ స్రైక్స్ అని బీజేపీ, కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరు అని టీఆర్ఎస్ పోటాపోటీ ప్రచారం చేసుకున్నాయి. పాకిస్తాన్, రోహింగ్యా, భాగ్యనగరం.. ఇలా అనేక రకాల ఎమోషనల్ ప్రసంగాలు నగర ప్రజలను ఆలోచనలో పడేశాయి. టీఎస్-బిపాస్ కావాలా లేక కర్ఫ్యూ పాస్ కావాలా అని టీఆర్ఎస్ ప్రచారం చేసి బీజేపీ గెలిస్తే ప్రతీరోజూ కర్ఫ్యూ తప్పదని భయాందోళనలు రేకెత్తించింది. మత ఘర్షణలు తప్పవని ప్రజలను హెచ్చరించింది. బీజేపీ సైతం అదే స్థాయిలో ‘మాది బరాబర్ హిందువుల పార్టీ’ అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల నుంచి పెరుగుతున్న బీజేపీ బలం..

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలు గెల్చుకుంది. ఓటు బ్యాంకును పెంచుకుంది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందింది. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా పడింది. చివరకు నాలుగు సీట్ల నుంచి 49 స్థానాల స్థాయికి చేరుకుంది. మజ్లిస్‌కు పట్టున్న ఒకటి రెండు డివిజన్లలో బీజేపీ గెలుపొందినా అధికార పార్టీ ఓట్లను, సీట్లను భారీ స్థాయిలోనే గుంజుకుంది. అధికార పార్టీకి దాదాపు సమాన స్థాయిలో ఓటు బ్యాంకును సంపాదించుకుంది.

నగరంలో సంభవించిన వరదల తర్వాత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తలా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినా అధికార పార్టీకి అది పెద్దగా పనికిరాలేదు. ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. సరిగ్గా ఈ అంశాలను బీజేపీ సద్వినియోగం చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే అయినా అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా అసెంబ్లీ ఎన్నికల తరహాలో వరాల వర్షం కురిపించాయి. పాతిక వేల రూపాయల సాయం చేస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గతంలో కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎల్బీనగర్, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీకే ఓటర్లు పట్టం గట్టారు.

పలు శివారు ప్రాంతాల్లోని డివిజన్లలోనూ బీజేపీకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో దాదాపు ఇరవై వరకు శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈసారి సెటిలర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ప్రజలు రెండు ప్రధాన పార్టీలవైపు నిలబడ్డారు. ఇరవై ఏళ్ళ క్రితం మేయర్ స్థానాన్ని సైతం కైవశం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 105 చోట్ల పోటీచేసినా ఒక్కచోట కూడా డిపాజిట్‌ను సాధించలేకపోయింది. కేవలం సీపీఐ, సీపీఎం లాంటి వామపక్షాలు తప్ప మిగిలిన అన్ని పార్టీలూ స్వంతంగానే పోటీ చేశాయి.

మేయర్ సీటు కోసం ఉన్న ఆప్షన్లేంటి?

అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ ఇప్పుడు మేయర్ సీటు కోసం రకరకాల ఆలోచనలు చేస్తోంది. మజ్లిస్‌తో అంటకాగుతోందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టాలంటే సంబంధాలను తెంచుకోవడమే మేలనే అభిప్రాయం టీఆర్ఎస్‌కు చెందిన నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా మేయర్ స్థానం పొందడానికి అవసరమైన సంఖ్యా బలం లేదు. దీంతో అనివార్యంగా మరో పార్టీ మద్దతుపై ఆధారపడాల్సి వస్తోంది. స్నేహ సంబంధాలు ఉన్న మజ్లిస్‌ నుంచి మద్దతు తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం వద్దనుకుంటున్నట్లు తెలిసింది.

ప్రత్యక్ష మద్దతు లేకుండా బైట నుంచి మద్దతు తీసుకోవడంపైనా టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. లేదా మజ్లిస్‌ పార్టీకే మద్దతు ఇచ్చి మేయర్ సీటును ఆ పార్టీకే వదిలేయడంపైనా చర్చలు జరుగుతున్నాయి. మజ్లిస్ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర పార్టీల నుంచి వచ్చేవారి మద్దతు తీసుకోవడంపైనా టీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకోవడం లేదా ఆకర్షించే ప్రయత్నాలు వద్దనుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీ సైతం మేయర్ సీటుకు పోటీపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

ఎక్స్ అఫీషియో సభ్యులు ఏ పార్టీకి ఎంతమంది?

గ్రేటర్ మేయర్ పీఠానికి ఏ పార్టీకి స్వంత మెజారిటీ రాకపోవడంతో ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అనివార్యమైంది. అయినా మూడు ప్రధాన పార్టీలకూ తగిన సంఖ్యా బలం సరిపోకపోవడంతో మరో పార్టీ మద్దతు అవసరమవుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యులు జీహెచ్ఎంసీలో ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఆ ఓట్లను ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో మ్యాజిక్ ఫిగర్‌ సాధించలేని పక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని పార్టీలు తీసుకుంటుంటాయి.

ఆ ప్రకారం చూస్తే… బల్దియాలో 150 కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్య 41 ఉంది. దీంతో మేయర్‌ను ఎన్నుకోడానికి మొత్తం 191 ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 28 మంది, ఎంఐఎం పార్టీకి 10 మంది, బీజేపీకి ముగ్గురు చొప్పున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఆ ఓటును వినియోగించుకున్నారు. మరోసారి వినియోగించుకునే అవకాశం లేదు. ఎక్స్ అఫీషియో సభ్యులు వారి పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఓటు వేసే అవకాశం లేదు.

ఈ లెక్కల ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 96 అవుతుంది. టీఆర్ఎస్ 56 స్థానాల్లో గెలుపందినందున ఇంకా 40 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం అవసరం. కానీ ప్రస్తుతం 28 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మేయర్ స్థానానికి తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రగతి భవన్, టీఆర్ఎస్ భవన్‌లో కూడికలు, తీసివేతల పనులు జరుగుతున్నాయి. ఎంఐఎం నుంచి మద్దతు తీసుకోడానికి టీఆర్ఎస్ సుముఖంగా లేదు. ఒకవేళ తీసుకున్నా ఏమేం షరతులు పెడుతుందోనన్న ఆందోళన కూడా ఉంది.

ఇక బీజేపీ అవకాశాలను పరిశీలిస్తే 49 స్థానాల్లో గెలిచినా ఇంకా యాభై మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం అవసరం. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎంపీ కిషన్ రెడ్డి మాత్రమే (మూడు ఓట్లు) ఉన్నారు. దీంతో మేయర్ సీటు సాధ్యం కాదు. ఇక మజ్లిస్ లెక్కలను చూస్తే గెలిచింది 43 స్థానాల్లో. కానీ ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఇంకా 53 అవసరం. కానీ ఉన్నది మాత్రం పది మందే. దీంతో ఈ పార్టీకి కూడా అవకాశం లేదు. ఈ మూడు పార్టీల్లో ఏదైనా మరో పార్టీ మద్దతు తీసుకోవడం అనివార్యంగా మారింది. కానీ ఈ మూడింటి మధ్య పొత్తు కుదిరే, మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో మేయర్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది.


Next Story

Most Viewed