రాత్రిళ్లు కూడా మెట్రో సర్వీసు కల్పించండి..

by  |
Hyderabad metro
X

మెట్రో రైలు. నగర వాసులకు ట్రాఫిక్​కష్టాలకు చెక్​పట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వీసులు. గ్రేటర్​వ్యాప్తంగా మూడు మార్గాల్లో 69కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ తనదైన ముద్రవేసుకుంది మెట్రో సంస్థ. కానీ, లాక్​డౌన్​తర్వాత నిలిచిన సర్వీసులను ఆన్​లాక్​తో పునరుద్ధరించింది. ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కానీ, ఉదయం 6నుంచి రాత్రి9:30వరకు మాత్రమే సర్వీసులను నడుపుతోంది. దీంతో నగరవాసులకు తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి వరకూ సర్వీసులను పొడిగించాలని ప్రజలు డిమాండ్​చేస్తున్నారు.

దిశ, బేగంపేట: గ్రేటర్​ప్రజలకు ట్రాఫిక్​కష్టాలనుంచి విముక్తి కల్పించేందుకు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా మెట్రో రైల్‌ను ప్రవేశపెట్టింది. దశల వారీగా మెట్రో మార్గాలను విస్తరించి నగరవాసుల మన్ననలు పొందింది. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లు నిలిచిన సర్వీసులు ఆన్ లాక్​తో పునరుద్ధరించ బడ్డాయి. కానీ, మెట్రో రైలు వేళలు నగరవాసులకు శాపంగా మారాయి. ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9:30గంటల వరకే మెట్రో రైలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. చివరి రైలు గమ్య స్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది. కానీ గ్రేటర్‌లో అదే సమయంలో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకుని ఇల్లు చేరుకోవడం సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో మెట్రో రైలు వేళలు పొడిగించడం అనివార్యమని రవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.

నాడు నాలుగు లక్షలు… నేడు రెండు లక్షలే..

నగరంలో మూడు మార్గాలలో 69 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్లలో గతేడాది మార్చికి ముందు నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించే వారు. సెలవులు, ఇతర పర్వదినాల సందర్భంగా రద్దీ మరో 50వేల మేర పెరిగేది. కానీ, ప్రస్తుతం మూడు రూట్లలో కేవలం రెండు లక్షల మంది మాత్రమే మెట్రో ను వాడుతున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శని, ఆది, సోమవారం ఎండల తీవ్రత స్వల్పంగా పెరగడంతో రద్దీ ఐదు శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఐటీ కారిడార్ లో వందలాది ఐటీ, బీపీఓ, కేపీఓ, కంపెనీల ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతించడం తో మెట్రో రద్దీ అనూహ్యంగా పడిపోయిన విషయం విధితమే. మరో వైపు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ బాధుడు, స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఆటో, క్యాబ్ లను ఆశ్రయించి ప్రయాణికుల జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మెట్రో కు అనుకున్నంత స్థాయి లో ఆదరణ పెరగలేదు.

మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పంద 2010 ప్రకారం ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కానీ నిర్మాణ సంస్థ అంచనాల లెక్క తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం లాక్ డౌన్ కంటే ముందు స్థితి అంటే నాలుగు లక్షల మార్క్​ను ఎప్పుడు చేరుకుంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. మూడు మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు పొడగించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రకటించినట్లు గా టికెట్లు, స్మార్ట్ కార్డు ల పై రాయితీ ని అమలు చేయాలని. అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ ల నుంచిసమీప కాలనీలు, బస్తీలకు ఆర్టీసీ మినీ బస్ లను విరివిరిగా నడపాలి. అన్ని స్టేషన్లలో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఇవ్వన్నీ చేస్తే మెట్రో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed