వారిని అరెస్ట్ చేయకపోతే.. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం : ఉత్తమ్

by  |
MP-Uttam-Kumar-Reddy,-MLA-S
X

దిశ, హుజూర్ నగర్: మున్సిపల్ అభివృద్ధికి కౌన్సిలర్లు కృషి చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు కోరారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఛైర్ పర్సన్ గెల్లి అర్చన అనారోగ్య కారణాల‌ వల్ల గైర్హాజరు కావడంతో, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు‌. ఈ మీటింగ్ ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే సైదిరెడ్డిలు హాజరై మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎజెండాలోని 57 అంశాలు, పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనుల పట్ల మీటింగ్‌లో వాడివేడిగా చర్చ జరిగింది. మీటింగ్ హాల్‌లో కోవిడ్ నిబంధనలు పాటించేలా‌ ఏర్పాట్లు లేవని కాసేపు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. అనంతరం 23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్ల ఎజెండాలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తి డీసెంట్ నోటీసులు ఇచ్చారు.

సమావేశం అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… నకిలీ విత్తనాలపై సీఎం కేసీఆర్ ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. నకిలీ విత్తనాల కేసులో నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్న ప్రభుత్వం.. చింతలపాలెం మండలంలో కోట్ల రూపాయల స్కామ్‌లో నిందితులను కనీసం పోలీసు స్టేషన్‌కు కూడా పిలవలేదని గుర్తుచేశారు. నియోజకవర్గంలో బట్టబయలైన నకిలీ విత్తనాల కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. హుజూర్ నగర్‌లో అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ పేరిట- మున్సిపల్ నిధులను తీర్మానం లేకుండా జిల్లా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్ అధికారాన్ని నాశనం చెయ్యడమే అన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, సమస్యలపై చర్చించాలని సూచించారు. ఖర్చుపై ఖచ్చితంగా పారదర్శకత ప్రదర్శించాలని కోరారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ వరకు పోరాడతామని అన్నారు.

హరితహారం, పట్టణప్రగతిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు సభ్యులై పెద్ద ఎత్తున చెట్లు నాటి గ్రీన్ హుజూర్ నగర్‌గా మార్చాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా మార్చేలా పారదర్శంగా పనిచేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే దుమ్ములేని పట్టణాన్ని చూస్తారని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలే మార్గంగా పనిచేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొ్న్నారు.


Next Story

Most Viewed