ఒక్క రోజులో వంద కోట్ల మద్యం అమ్మకాలు

by  |
ఒక్క రోజులో వంద కోట్ల మద్యం అమ్మకాలు
X

– మద్యం డిపోలకు హమాలీల కొరత
– అర్ధరాత్రి వరకూ డిపోలకు లోడింగ్ అనుమతి
– మొదటి రోజున సాఫ్ట్‌వేర్ సమస్యలు

దిశ, న్యూస్ బ్యూరో :
మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొదటి రోజునే సుమారు రూ. 100 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా అమ్మకాలు జరిగేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని 28 వైన్ షాపులపై కేసులు నమోదయ్యాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు అధికారికంగా గణాంకాలను ఇవ్వకపోయినప్పటికీ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు అంచనా. గురువారం నుంచి అమ్మకాల కోసం వైన్ షాపుల నిర్వాహకులు రాష్ట్రంలోని 19 డిపోలకు ఇప్పటికే సుమారు రూ. 53 కోట్ల మేర ఇండెంట్ ఇచ్చారు. అయితే డిపోల్లోని సరుకును వ్యాన్లు, లారీల్లోకి ఎక్కించడానికి తగినంత సంఖ్యలో హమాలీలు లేకపోవడం లోడింగ్‌కు సమస్యగా మారింది. ప్రతీ డిపోకు సగటున సుమారు వంద మంది హమాలీలు ఉంటున్నప్పటికీ 43 రోజులుగా ఎలాంటి యాక్టివిటీ లేకపోవడంతో చాలా మంది సొంతూళ్ళకు వెళ్ళారని, అందువల్ల కొరత ఏర్పడినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి మెరుగుపడనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ మొదలు మే 5వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ మూసే ఉండటంతో అప్పటివరకు షాపుల్లో ఉన్న స్టాకునే నిర్వాహకులు బుధవారం విక్రయించారు. మార్చి 20వ తేదీన డిపోల నుంచి వివిధ మద్యం దుకాణాలకు వెళ్ళిన లిక్కర్, బీరు సుమారు రూ. 88.95 కోట్లుకాగా మార్చి 21వ తేదీన సుమారు రూ. 109 కోట్ల మేర స్టాకు వెళ్ళింది. ఈ రెండు రోజుల స్టాకులో ఎక్కువ భాగం అమ్ముడుకాకుండా ఉండిపోయిందని, ఈ ఒక్కరోజులో జరిగిన విక్రయాలు అప్పటి స్టాకేనని ఆ అధికారి పేర్కొన్నారు. మామూలు రోజుల్లో ప్రతీరోజు సగటున రూ. 60 నుంచి రూ. 70 కోట్ల మధ్య మద్యం అమ్మకాలు ఉంటుంటాయని, శనివారం లేదా వీకెండ్స్ రోజుల్లో మాత్రం సుమారు రూ. 90 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. గడచిన 43 రోజులుగా మద్యం లేనందువల్ల తొలిరోజున చాలా మంది కొనుగోలు చేశారని, పూర్తి వివరాలు అందడానికి సమయం పడుతుందని తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం మీద సుమారు 18.77 లక్షల కేసుల మద్యం, 26.40 లక్షల బీర్ కేసుల విక్రయం జరిగిందని, దీని విలువ సుమారు రూ. 1371 కోట్లు అని ఎక్సైజ్ శాఖ సమాచారం.

డిపోల్లో మూడు రోజుల స్టాక్ సిద్ధం..

రాష్ట్రంలోని మొత్తం 19 డిపోల్లో బుధవారం సాయంత్రం సమయానికి 29 లక్షల కేసుల బీరు, 16.5 లక్షల కేసుల మద్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ఇది దాదాపు మూడు రోజులకు సరిపోతుందని, అప్పటికల్లా బ్రూవరీస్, డిస్టిల్లరీల నుంచి మరింత స్టాకును తెప్పించుకుంటాయని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే బ్రూవరీలు, డిస్టిల్లరీలు కూడా గత 43 రోజులుగా పనిచేయడంలేదని, అక్కడ స్కిల్డ్ కార్మికులు ఊళ్ళకు వెళ్ళిపోయారని, రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, అప్పటివరకూ ఉత్పత్తిపై కొంత ప్రభావం ఉంటుందని వివరించారు. ఇంతకాలం యంత్రాలు పనిచేయనందున మళ్ళీ పనిచేయించాలంటే వాటికి ముందుగా ఓవర్‌హాలింగ్ చేయించాలని, ఆ పని చేయాల్సిన టెక్నికల్ సిబ్బంది ప్రస్తుతం అందుబాటులో లేరని పేర్కొన్నారు. ఆ పని తెలిసినవారిని బయట నుంచి రప్పించుకునేందుకు రెట్టింపు చార్జీలు అడుగుతున్నారని, ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని తెలిపారు.

డిపోల్లో ఉన్న స్టాకు అయిపోయిన వెంటనే డిస్టిల్లరీల నుంచి తెప్పించుకోక తప్పదని, ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం రాష్ట్రంలోని 18 బ్రూవరీలు, డిస్టిల్లరీల దగ్గర 8 లక్షల కేసులకు సరిపోయేంత మద్యం బ్లెండింగ్ చేసి రెడీగా ఉన్నదని, కేవలం బాట్లింగ్ చేయాల్సిన ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని వివరించారు. ఆ ప్రక్రియకు సాంకేతిక సిబ్బంది కొరత లేదని పేర్కొన్నారు.

సాప్ట్‌వేర్ సమస్య :

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను సగటున 16% మేర పెంచినందున, దుకాణాలు పెట్టే ఇండెంట్ల ప్రకారం లోడింగ్ చేయించాలంటే ముందుగా సాఫ్ట్‌వేర్‌లో కొత్త ధరలను అప్‌లోడ్ చేయడం అనివార్యమైంది. అయితే ఒక్కో బ్రాండ్ మద్యం, బీరుతోపాటు వాటి పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ధరలన్నింటినీ మార్చడానికి దాదాపు మధ్యాహ్నం 3.00 గంటల వరకూ పట్టిందని ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు. సాయంత్రం ఏడు గంటల సమయానికి అన్ని దుకాణాల నుంచి సుమారు రూ. 53 కోట్ల మేర ఇండెంట్ వచ్చిందని, హమాలీల కొరత ఉన్నందున కొంత లోడింగ్ జరిగి వ్యాన్‌లు వెళ్ళిపోయాయని, మిగిలిన లోడింగ్ అర్ధరాత్రి వరకు పూర్తవుతుందని తెలిపారు. అర్ధరాత్రి వరకూ లోడింగ్ చేసుకోడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు ఆ అధికారి తెలిపారు. బ్రూవరీలకు మాత్రం ఉత్పత్తి చేసుకోడానికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, డిస్టిల్లరీలకు మాత్రం గురువారంకల్లా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Tags: Telangana, Beverages Corporation, Wine Shops, Liquor, Beer, 100 crores, Sales

Next Story