ఆమెను టచ్ చేస్తే.. అందమైన ఆర్ట్

by  |
ఆమెను టచ్ చేస్తే.. అందమైన ఆర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలను వర్ణించే క్రమంలో.. ముట్టుకుంటే కందిపోతుందని అంటుంటాం. కానీ, డెన్మార్క్‌కు చెందిన ఓ అమ్మాయిని ముట్టుకుంటే నిజంగానే కందిపోతుంది. ఎమ్మా అల్డెన్‌రైడ్ అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి చర్మాన్ని ఇలా టచ్ చేయగానే.. అలా పొంగిపోతుంది. ఆమె చర్మం ఎంత సున్నితమైనదంటే.. బట్టలు వేసుకునేటప్పుడు చిన్న రాపిడికి గురైన సరే, ఆమె స్కిన్ కందిపోతుంటుంది. ఎందుకలా? అంటే.. ఆమెకు ‘టచ్ ఎలర్జీ’ ఉంది. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ‘డెర్మటాగ్రాఫియా’. అయితే, తన స్కిన్ అలర్జీకి సృజనాత్మకతను జోడించిన అల్డెన్.. తన శరీరాన్నే కాన్వాస్‌గా చేసి, అందమైన ‘డూడుల్స్’ గీసేస్తోంది.

https://www.instagram.com/dermatographia_/?utm_source=ig_embed

సాధారణంగానే కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడం చూస్తుంటాం. ఒకవేళ అలాంటి పదార్థాలు తిన్నట్టయితే వెంటనే అలర్జీకి గురై ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే ఎమ్మాకు ‘టచ్ ఎలర్జీ’ అనే అరుదైన వ్యాధి ఉంది. ఆమెను తాకితే చాలు.. చర్మం కందిపోతుంది. కానీ, ఆమెకు దీనివల్ల నొప్పి చాలా మైల్డ్‌గా ఉంటుండంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ‘ఎమ్మా’ తన స్కిన్ ఎలర్జీని పాజిటివ్‌ మోడ్‌లోకి టర్న్ చేసింది. అలా తన చర్మంపై రకరకాల డూడుల్స్ గీస్తూ.. ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. ‘హ్యమన్ ఎట్చ్-ఎ-స్కెచ్’గా మలుచుకుని.. అమితమైన ఆదరణ పొందుతూ.. ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. పెన్సిల్‌తో ఆమె శరీరంపై వేసిన ఏ ఆర్ట్ అయినా.. అరగంట సేపు ఉంటుంది. ఆ తర్వాత చర్మం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

ఎమ్మాకు మూడేళ్ల వయసులో ఈ చర్మ సమస్య వచ్చింది. ఎమ్మా ఇద్దరి చెల్లెళ్లకు కూడా ఇదే సమస్య ఉంది. ఈ సమస్యకు యాంటీ హిస్టామిన్ డ్రగ్ వాడాల్సిందిగా వైద్యులు ఎమ్మాకు సూచించినా గానీ, ఆమె అందుకు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎలర్జీ వల్ల తనకు ఏ సమస్యా లేదని, ఒకవేళ తనకు మరింత ప్రాబ్లెమ్‌గా మారితే తప్పకుండా మెడిసిన్ వాడతానని తెలిపింది. ఈ టచ్ ఎలర్జీ తనకు దూరమైతే.. ఇకపై తాను తన డూడుల్స్ వేయలేననే ఆలోచనతోనే ఆమె ఇలా చెప్పింది. అయితే, రానున్న కాలంలో ఏమైనా సమస్యలు రావచ్చని వైద్యులు అంటున్నారు. ఎమ్మా ఇకనైనా చర్మంపై బొమ్మలు గీయడం ఆపి.. చికిత్స పొందితే మంచిదని ఆమె అభిమానులు కోరుతున్నారు.


Next Story