సీఎం కేసీఆర్ కంచుకోటలో టీఆర్‌ఎస్‌కు షాక్

by  |
సీఎం కేసీఆర్ కంచుకోటలో టీఆర్‌ఎస్‌కు షాక్
X

దిశ ప్రతినిధి, మెదక్: సీఎం సొంత జిల్లాలో టీఆర్ఎస్ బలహీనపడుతుందా..? అంటే దాదాపు అవుననే సమాధానమే వినపిస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందనరావు గెలుపొందడంతో టీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గడం మొదలవ్వగా.. ఇప్పుడు సిద్దిపేట జిల్లా రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు సొంత పార్టీని వీడి బీజేపీలో చేరడమే ఇందుకు నిదర్శనం. వీరే కాదు మరికొద్ది రోజుల్లో మరికొందరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ రఘునందన్‌రావు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఆయనను చూసి టీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీలో చేరేందుకు సుముఖత చూపారు. దుబ్బాక మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, ఏడో వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8వ వార్డు కౌన్సిలర్ బాలకిషన్ గౌడ్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు అంబటి బాలేశ్ గౌడ్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ కండువా కప్పి సంజయ్ పార్టీలో ఆహ్వానించారు. వీరేగాక మరికొందరు చేరే అవకాశాలు ఉన్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.

టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారన్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఆగమేఘాల మీద ఆ పార్టీ అధ్యక్షునితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆస స్వామి , తన సహచర నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు కౌన్సిలర్లు మల్లారెడ్డి , కనకయ్య , బాలకిషన్లను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారు బీజేపీలో చేరగా.. టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడమేంటని, బీజేపీలో చేరకముందే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాల్సింది అంటూ పలువురు టీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్టే?

టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేట గడ్డపై రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్టు స్పష్టమవుతుంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని కొండపాక మండలం తిప్పారం గ్రామ మహిళలు అడ్డుకున్నారు. చేర్యాల పట్టణంలోని చిట్యాల గ్రామంలోనూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ఇటీవల సీఎం సిద్దిపేటలో పర్యటించిన సందర్భంలో అధికార పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు సొంత పార్టీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్టు కనబడుతుంది.


Next Story

Most Viewed