మెడ భాగంపై నలుపు ఇబ్బందిగా అనిపిస్తోందా?. అయితే ఇలా చేయండి..

by Disha Web Desk 16 |
మెడ భాగంపై నలుపు ఇబ్బందిగా అనిపిస్తోందా?. అయితే ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్: చాలా మంది ముఖం అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే ముఖంతో పాటు శరీరం మొత్తానికి, మెడభాగానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. కొందరిలో మెడభాగం నల్లగా ఉండటం అనేది వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఇది కొందరిలో గిల్టీ ఫీలింగ్‌కు దారి తీస్తుంది. అయితే అది పుట్టుకతో వచ్చిన సమస్యా? లేదా జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల ఏర్పడిన సమస్యా? అనేది తెలుసుకుంటే నివారణ సులభం అవుతుందంటున్నారు నిపుణులు.

సహజంగా పరిశుభ్రత పాటించకపోవడం, పాటించినా పొల్యూషన్‌, కరుకైన చర్మ లక్షణం, వివిధ రకాల చైన్లు ధరించడం, దీర్ఘకాలిక వ్యాధులు, గాయాలు తదితర కారణాలవల్ల కొందరికి మెడపై చర్మం నల్లగా మారుతుంది. ఇంకొందరు మహిళల్లో ప్రెగ్నెన్నీ టైమ్‌లో కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ఆ తర్వాత కూడా సమసి పోకుండా ఉంటుంది. తరచూ చెమట వచ్చే వారిలోనూ ఏర్పడవచ్చు. అయితే ఈ నలుపును ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలవల్ల పోగొట్టుకోవచ్చు.


కాఫీ పొడితో..

ఒక టీ స్పూన్ కాఫీ పొడి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి. దీనిని నల్లగా మారిన మెడ భాగంలో అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా కొంతకాలం చేస్తే నలుపుదనం పోయి సహజ రంగులోకి వస్తుంది. అంతేకాదు కాఫీపొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేసి, మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. శరీరంపై ముడతలనూ తొలగిస్తుంది.

టొమాటాతో..

టొమాటో బ్లీచింగ్ లక్షణాలు ఉండటంవల్ల ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కొంచెం టొమాటో రసం తీసుకొని, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, కాస్త తేనె వేసి మిక్స్‌ చేసి మెడభాగంపై నల్లగా ఉన్నచోట అప్లై చేయాలి. కాసేపాగి నీటితో శుభ్రం చేయాలి. టొమాటో, నిమ్మరసంలో పుష్కలంగా ఉండే విటమిన్ 'సి' వల్ల నల్లటి చర్మం నాచురల్‌గా మారిపోతుంది.

బంగాళదుంపతో..

బంగాళదుంప (ఆలు) తొక్కను తీసి దానిని పేస్టుగా మార్చాలి. తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం మిక్స్ చేయాలి. ఇప్పుడీ పేస్టును నల్లటి చర్మ భాగంలో అప్లై చేసి, ఆరిన తర్వాత వాటర్‌తో శుభ్రం చేయాలి. దీనివల్ల మెడపై నలుపు మాయం అవుతుంది.

కీరా దోసతో..

కీరా దోసను కట్ చేసి, దాని ముక్కతో 15 నిమిషాల పాటు మెడ దగ్గర ఉన్న నల్లటి భాగంపై మర్దన చేసుకోండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. కీరాదోస క్లెన్సర్‌లా పని చేసి, మెడపై ఉన్న నలుపును దూరం చేస్తుంది.

పాలమీగడతో..

పాలమీగడ తెలియనివారుండరు. తగిన మోతాదులో తీసుకొని, నిమ్మరసం, చిటికెడు పసుపు కూడా తగిన మోదాదులో కలపాలి. మెడపై నల్లటి భాగంలో పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగితే నలుపురంగు క్రమంగా తగ్గిపోతుంది.

నిమ్మతో..

మెడపై ఎక్కడైతే నల్లటి చర్మం ఉంటుందో అక్కడ కాటన్‌తో నిమ్మరసాన్ని అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇలా కొంతకాలం చేస్తే నల్లటి చర్మం సాధారణంగా కనిపిస్తుంది. అయితే నిమ్మరసం అప్లై చేసినచోట దానిని కడిగే వరకు ఎండ పడకుండా చూడాలి. నిమ్మరసం చర్మంపై పేరుకున్న మృతకణాలను, జిడ్డును, మురికిని తొలగించే అద్భుత ఔషధం.



Next Story