ఆర్డర్లు చెల్లవని ‘సీఎస్’ సర్క్యులర్.. మరీ ఈటలపై చెల్లేనా?

by  |
ఆర్డర్లు చెల్లవని ‘సీఎస్’ సర్క్యులర్.. మరీ ఈటలపై చెల్లేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. గ్రామస్థులు ఫిర్యాదు చేశారంటూ సీఎం కేసీఆర్ వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో 65 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని యుద్ధప్రాతిపదికన సర్వే చేశారు. లెక్క తేల్చి కబ్జాకు పాల్పడ్డారంటూ నివేదిక సమర్పించారు. ఐతే మార్గదర్శకాల ప్రకారమే సర్వే చేయాలంటూ హైకోర్టు సూచించింది. దాంతో మళ్లీ మొదటికొచ్చింది. అలాగే మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం దేవరయంజాలలో శ్రీ సీతారామస్వామి ఆలయ భూములనూ కబ్జా చేశారంటూ ఏకంగా నలుగురు సీనియర్ ఐఏఎస్‌లను రంగంలోకి దింపారు.

ఓ పత్రికలో కథనం వచ్చిందంటూ విచారణకు వారిని నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని కూడా.. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోందని, జనం చనిపోతున్న తరుణంలో ఇదేమంత అర్జంట్ అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదంతా ఇలా ఉండగా ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరగణంపై దర్యాప్తు చెల్లదని రెవెన్యూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతేడాది సెప్టెంబరు ఏడో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్ లైవ్‌లో ఉన్నంత కాలం ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు కాదంటున్నారు. దాన్ని ఉపసంహరించుకున్న తర్వాత చేపట్టే ఏ ప్రక్రియకైనా విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం.. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రానున్న కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే అన్నీ పరిష్కరించాలి. అప్పటి వరకు ఎలాంటి భూ సంబంధ అంశాలపై ఆర్డర్లు జారీ చేయొద్దు.. అంటూ గతేడాది సెప్టెంబరు 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ రెఫరెన్స్ నం.ఏఎస్ఎస్.1(1)/463/2020, తేదీ.7.9.2020 ఆదేశించారు. దీని ప్రకారం మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ల్యాండ్ మ్యాటర్స్ ముట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ జారీ చేసినా చెల్లదు. ఈ ఆదేశాలను రెవెన్యూ శాఖలోని అధికారులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదంటూ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ(ఎఫ్ఏసీ) సోమేష్ కుమార్ పేర్కొన్నారు.

ఏదేని ఆదేశాలు జారీ చేసినా చెల్లవని ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది జారీ చేసి ఎనిమిదిన్నర నెలలైంది. జారీ చేసిన ఆ ఉత్తర్వులపై ఇప్పటి వరకు పున:సమీక్షించలేదు. ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లుగా మరో ఉత్తర్వు జారీ చేయకుండా చేపట్టే ఏ ప్రక్రియ ముందుకుపోదని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ‘దిశ’కు వివరించారు.

ఈటలకు ప్రత్యేకమా ?

కేవలం ఆర్వోఆర్ కేసులు మినహా మరే ఇతర ఫిర్యాదులను స్వీకరించొద్దు. స్వీకరించినా వాటిని పరిష్కరించొద్దు. మొత్తంగా ఏ ఆదేశాలు జారీ చేయొద్దు. ఏమైనా ఆదేశాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావు. మరి మాజీ మంత్రి ఈటల భూ వ్యవహారంలోని రెండు ప్రధాన కేసులు ఈ సర్క్యులర్‌కు లోబడి లేవు. అసైన్డ్, దేవాలయ భూములకు సంబంధించిన ఏ అంశాన్ని పట్టించుకోవద్దు. మరిప్పుడు అచ్చంపేట, హకీంపేట, దేవరయంజాలలో అసైన్డ్, ఆలయ భూములపై చేపడుతోన్న దర్యాప్తునకు ప్రత్యేకత ఏమిటో అర్ధం కావడం లేదని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవద్దన్న సర్క్యులర్ జారీ చేసింది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారే.. అలాగే దర్యాప్తునకు నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించిందీ ఆయనే.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగమంతా సెప్టెంబరు ఏడో తేదీ సర్క్యలర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్న తరుణంలో ఈ కమిటీలు, రెవెన్యూ యంత్రాంగం తీసుకునే ఏ నిర్ణయానికి విలువ ఉండే అవకాశం లేదంటున్నారు. పీఓటీ చట్టం కింద నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నా సదరు సర్క్యులర్ అడ్డంకింగానే ఉంటుందని రిటైర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని కారణంగానే రాష్ట్రంలో వేలాది కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. అలాంటి క్రమంలో ఈటల భూములపై ప్రత్యేకత రాజకీయ కోణంగానే చూస్తున్నారు.

దాంతో వేలాది మందికి ఇక్కట్లు

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు ఏడో తేదీ సర్క్యులర్ వేలాది మందిని సమస్యలకు గురి చేస్తోంది. అప్పటి నుంచి ఆర్వోఆర్ మినహా అన్ని సమస్యలు పెండింగులో పడ్డాయి. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు చేయదగ్గ, పరిష్కరించాల్సిన కేసులన్నీ మూలకు వేశారు. 250 రోజులుగా ఏ సమస్యను పరిష్కరించడం లేదు. కనీసం ఏ ఫైలు ముట్టుకోవడం లేదు. దీంతో వేలాది మంది తమ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా మా సమస్యను అపరిష్కృతంగా ఉంచారు. ఇకనైనా న్యాయం చేయండంటూ వేడుకుంటున్నారు. ఐనా అధికారుల చేతిలో ఏమీ లేకపోవడంతో ఉత్తర్వుల గురించి చెప్పి పంపిస్తున్నారు.

ప్రతి రోజూ పదుల సంఖ్యలో కార్యాలయానికి వచ్చి పదేపదే గోడు వెళ్లబోసుకోవడం, తామేం చేయలేమని చెప్పలేక ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. తాము ఏమీ చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులకు లేఖలు రాయమని కొందరు ఆర్డీఓలు దరఖాస్తుదారులను కోరడం విశేషం. ఇంకొందరైతే ఏది ముట్టుకోవద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయించాలంటూ హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని సూచిస్తున్నారు. అప్పటికైనా ఆర్వోఆర్ మినహా పీఓటీ, టెనెన్సీ, ఇనాం వంటి అనేక రకాల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం దక్కుతుందంటున్నారు.

అవసరం లేని దానికి 250 రోజులు

కొత్త రెవెన్యూ చట్టం అమలు చేస్తున్నామనే నెపంతో ఈ సర్క్యులర్ జారీ చేశారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం కేవలం ఆర్వోఆర్‌కు మాత్రమే పరిమితం. అదేమీ కొత్త రెవెన్యూ చట్టం కాదు. మిగతా చట్టాలన్నీ యథాతథంగా ఉన్నాయి. కానీ కొత్తగా తామేదో అద్భుతమైన చట్టాన్ని తీసుకొస్తున్నామని, ఈ క్రమంలోనే అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడి దరఖాస్తుదారులను పరిశీలించకుండానే ఏకపక్షంగా ఆర్డర్లు జారీ చేస్తారని ప్రభుత్వం భావించింది. అందుకే చట్టం వచ్చేంత వరకు అన్నింటినీ ఆపేయాలని ఆదేశించారు.

కానీ తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020ని అమల్లోకి తీసుకొచ్చారు. అది కొత్త రెవెన్యూ చట్టం కాదు. కేవలం కొత్త ఆర్వోఆర్ చట్టం మాత్రమే. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్ల పరిధిలోని అంశాలకు, ఈ చట్టానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ చట్టరూపకల్పన సమయంలో పొరపాట్లు జరగొద్దంటూ బ్రేకులు వేశారు. దాంతో ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ వంటి కేసుల్లో నిరభ్యంతర దృవీకరణ పత్రాలు, ఓఆర్సీలు ఇచ్చే ప్రక్రియకు ఎనిమిదిన్నర నెలలుగా మోక్షం కలగడం లేదు.



Next Story

Most Viewed