అన్నార్థుల కడుపు నింపుతున్న ‘ఫుడ్ కూపన్’

70

దిశ, వెబ్‌‌డెస్క్: లాక్‌డౌన్‌లో ఎంతోమంది సహృదయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆకలితో ఉన్న లక్షలాది మంది కడుపు నింపారు. అవసరాల్లో ఉన్న వారికి చేతనైన సాయం అందించారు. ఇక లాక్‌డౌన్ సడలింపుల తర్వాత.. కస్టమర్లు లేక బాధపడుతున్న ‘బాబా కా దాబా, కాంజీ బడే వాలా అంకుల్, కొచ్చి ట్రాన్స్ ‌వుమెన్, కేరళ పార్వతీయమ్మ’ల గాథలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి వ్యాపారం సక్సెస్ కావడంలో నెటిజన్లు, స్థానిక కస్టమర్లు చొరవ చూపారు. ఇలా సాయం అందాల్సిన ప్రతి చోట ‘మేమున్నాం’ అంటూ మానవత్వం ఇంకా బతికేఉందని నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకేసిన బెంగళూరులోని ఓ హోటల్ నిర్వాహకులు.. అన్నార్థులు, భిక్షగాళ్ల కడుపు నింపుతూ సహృదయతను చాటుకుంటున్నారు.

దక్షిణ బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే గాంధీ బజార్‌‌లోని ఫుట్‌పాత్‌పై ‘రామప్ప’ అనే కళ్లులేని వృద్ధుడు ప్రతిరోజు భిక్షాటన చేస్తుంటాడు. ఇటీవలే ఓ రోజు ఆ ప్రాంతంలోని ఫేమస్ హోటల్‌(విద్యార్థి భవన్)లోని సర్వర్.. ఫుడ్ పార్సిల్ తీసుకొచ్చి ఆ పెద్దాయన చేతిలో పెట్టాడు. వేడి వేడి బటర్ మసాలా దోశతో పాటు, రైస్, పాన్ కేక్స్ అందులో ఉన్నాయి. మోస్ట్ సెలెబ్రేటెడ్ డిష్ అతని చేతిలో పెట్టగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఇది రామప్ప ఒక్కడితోనే ఆగిపోదు. అలాగని ఒక్క విద్యార్థి భవన్ మాత్రమే ఈ పని చేయడం లేదు. బెంగళూరులోని హోటల్స్ నిర్వాహకులు ‘వన్ ఫర్ ది వాల్’ అనే కాన్సెప్ట్ తీసుకుని ఈ విధంగా అన్నార్థులు, భిక్షగాళ్లకు మీల్స్ అందిస్తున్నారు.

అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ‘ఫర్ ది వాల్’ కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా.. హోటల్లో, ఫుడ్ కోర్టుల్లో భోజనం లేదా టిఫిన్ ఆర్డర్ చేస్తూ, ఓ ఎక్స్‌ట్రా కూపన్ కూడా తీసుకుంటారు. ఆ హోటల్ ముందుకు ఎవరైనా ఆకలితో వచ్చే పేదలకు, భిక్షగాళ్లకు ఆ ఎక్స్‌ట్రా కూపన్స్ ద్వారా ఆహారం అందిస్తారు. ఓ సారి విదేశాల్లో పర్యటించిన సందర్భంలో రైటర్ ‘గురురాజ్ కరజగిని’ని ఈ కాన్సెప్ట్ ఆకర్షించింది. ఈ ఆలోచనను తన స్నేహితులతో పంచుకున్నాడు. అది కాస్త అలా స్ప్రెడ్ అయిపోవడంతో.. రోటరీ బెంగళూరు సౌత్ పరేడ్ దీన్ని ముందుకు తీసుకెళ్లింది. దీంతో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా.. బెంగళూరు హోటల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థి భవన్ తొలిసారిగా ‘సంచిగొండు’(వన్ ఫర్ ది బ్యాగ్) అనే పేరుతో ఈ కాన్సెప్టును లాంచ్ చేసింది. బెంగళూరు వ్యాప్తంగా మొత్తంగా 45 హోటళ్లు ఈ సంచిగొండులో భాగమయ్యాయి.

గిఫ్ట్ ఏ మీల్ .. బ్రింగ్ స్మైల్

సంచిగొండు ఇన్షియేట్‌లో భాగంగా.. కస్టమర్ తన కోసం ఓ ఫుడ్ కూపన్ తీసుకుంటే, అన్నార్థుల కోసం మరో కూపన్ తీసుకోవాలి. హోటల్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన ‘సంచిగొండు’ డెడికేటెడ్ బాక్స్‌లో ఆ కూపన్ డ్రాప్ చేయాలి. హోటల్ ముందుకు లేదా హోటల్ పరిసరాల్లో ఆకలితో ఉన్న పేదలకు, భిక్షగాళ్లకు పార్సిల్ మీల్స్ అందిస్తారు. కొన్ని హోటళ్లు మరింత మంచిగా ఆలోచించి.. టోకెన్ ధరలో 50 శాతం మాత్రమే తీసుకుంటున్నాయి. ఇప్పటికే బెంగళూరులో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సంచిగొండు’ కాన్సెప్టును వివరించేలా ప్రతి హోటల్‌లో పోస్టర్లు, ప్ర్యతేక బోర్డులు కూడా రూపొందించారు.

ఇలా బెంగళూరులోని అన్నార్థులు గౌరవంతో కూడిన ఫుడ్ పార్సిల్స్ అందుకుంటున్నారు. ఇలాంటి ఆలోచన ఇతర మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ మొదలైతే బాగుంటుంది కదా. బిందువు, బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. ఎంతటి లక్ష్యమైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అది నువ్వే ఎందుకు కాకూడదు.