నామ్ తేరా.. కామ్ మేరా.. కామారెడ్డిలో ఆస్పత్రుల నిర్వాకం..!

by  |
నామ్ తేరా.. కామ్ మేరా.. కామారెడ్డిలో ఆస్పత్రుల నిర్వాకం..!
X

దిశ, కామారెడ్డి : నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాలో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాలు ఏదైనా పేరు పొందిన ఆస్పత్రిలో పని చేస్తే చాలు.. నూతన ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. అనుమతులు మాత్రం పేరు పొందిన వైద్యుల పేరుమీద తీసుకుంటున్నారు. అనుమతి రాగానే ప్రజాప్రతినిధులతో ఆస్పత్రులను ప్రారంభింపజేస్తున్నారు. దాంతో ఫలానా ఆస్పత్రి ఫలానా నాయకుడు ప్రారంభించారు అది గొప్ప ఆస్పత్రి కావచ్చు అంటూ ప్రజలు ఆ దవాఖానకు ఎగబడుతున్నారు. తీరా చూస్తే అక్కడ అనుభవం ఉన్న వైద్యులు లేక పరిజ్ఞానం లేని వ్యక్తులు ఆపరేషన్లు చేస్తుండటంతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

నిబంధనలకు పాతర

ఒక ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే సవాలక్ష కొర్రీలు ఉంటాయి. ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పట్టా పొంది ఉండాలి. ఆస్పత్రిలో ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఆస్పత్రి చుట్టూ ఫైరింజన్ తిరిగేంత ఓపెన్ స్థలం ఉండాలి. దానికి ముందు ఫైర్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలి. అన్ని ఓకే అనుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఏ ఆస్పత్రికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతులు లేవు. ఆస్పత్రి ముందు కనీసం 108 అగేంత స్థలం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తున్నారు.

పేరొకరిది.. నిర్వహణ మరొకరిది

జిల్లాలో ఉన్న ఆస్పత్రుల్లో అనేక ఆస్పత్రులో ఎవరి పేరునైతే అనుమతి తీసుకున్నారో సంబంధిత వైద్యులు ఆ ఆస్పత్రిలో ఉన్నారన్న గ్యారంటీ లేదు. ఆస్పత్రికి అనుమతి కావాలంటే ఎంబీబీఎస్ పట్టా పొందిన వైద్యుడు కావాలి. అలాంటి పట్టా ఉన్న వైద్యుని పేరున అనుమతి తీసుకొని ఎలాంటి అర్హత లేని వారు ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అత్యవసర ఆపరేషన్ నిమిత్తం వివిధ ఆస్పత్రుల నుంచి వైద్యులను రప్పించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. సదరు వైద్యునికి ఎంతోకొంత ముట్టజెప్పి పేషంట్ ను మాత్రం ఆస్పత్రి సిబ్బంది మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఏదైనా జరిగితే గుట్టుచప్పుడు కాకుండా పేషంట్లను హైదరాబాద్ కు తరలించిన ఘటనలు, మార్గమధ్యలోనే పేషంట్ మృతి చెందిన ఘటనలు జిల్లాలో కోకొల్లలు.

పట్టించుకోని వైద్యాధికారులు

జిల్లాలో విచ్చల విడిగా అనుమతులు లేకుండా ఆస్పత్రులు కొనసాగుతున్నా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు నిర్వహిస్తాం అని అధికారులు చెప్తున్న మాట. తాజాగా జిల్లా కేంద్రంలో కౌసల్య ఆస్పత్రిలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్య బృందం వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేదాకా జిల్లా అధికారులకు అందులో లింగ నిర్దారణ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలియకపోవడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు తమకు రాలేదని జిల్లా వైద్యాధికారి చెప్తుండగా ప్రోగ్రాం ఆఫీసర్ మాత్రం ఫిర్యాదు వచ్చిందని చెప్పడం చూస్తుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల తీరు ఎలా ఉందో తెలుస్తోంది.

అధికారుల తీరు మారేనా..?

జిల్లాలోని ఆస్పత్రుల్లో కొనసాగుతున్న వైద్యం ఏవిధంగా ఉంది, ఆస్పత్రుల్లో వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంలో జిల్లా వైద్యాధికారులు విఫలమవుతున్నారు. జిల్లా అధికారులకు సమాచారం లేకుండా రాష్ట్ర వైద్యబృందం గురువారం జిల్లా కేంద్రానికి వచ్చి అనుమతి లేకుండా స్కానింగ్, ఆపరేషన్లు, లింగనిర్దారణ చేస్తున్న ఆస్పత్రిని సీజ్ చేయడం జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్ర ప్రత్యేక బృందం వచ్చి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తనిఖీలు జిల్లా అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఇకనైనా అధికారుల్లో మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధానంలో తనిఖీలు కొనసాగితే అనేక ఆస్పత్రుల్లో ఉన్న డొల్లతనం బయటపడే అవకాశం ఉంది. మరి అధికారులో ఇకనైనా మార్పు వస్తుందో.. తనిఖీలు చేపడతారో లేదో వేచి చూడాలి.


Next Story

Most Viewed