‘హిజ్బుల్’ చీఫ్ రియాజ్ హతం

by  |
‘హిజ్బుల్’ చీఫ్ రియాజ్ హతం
X

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, తలపై 12 లక్షల రివార్డు ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నాయికూ హతమయ్యాడు. పుల్వామా జిల్లాలో ఈ రోజు ఉదయం మొదలైన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన ఉగ్రవాదిగా భావిస్తున్న రియాజ్‌ను పోలీసు బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని బెయిగ్‌పురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ముందస్తు సమాచారంతో జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం రాత్రి మొదలైన ఈ ఆపరేషన్‌లో బుధవారం ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ రియాజ్ నాయికూ చనిపోయాడు. అతనికి సన్నిహితుడుగా భావిస్తున్న ఉగ్రవాది సహా మరొకరు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సీనియర్ పోలీసులు పర్యవేక్షించారు. దాదాపు ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు రియాజ్ నాయికూ హతమవడం ఉగ్రవాదుల ఏరివేతలో గట్టి ముందడుగు అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవలి కాలంలోనే రెండు ఎన్‌కౌంటర్‌లలో ఆర్మీ కల్నల్, మేజర్, ఎస్‌హెచ్‌ఓలు సహా ఎనిమిది మంది భద్రతా సిబ్బంది కన్నుమూసిన సంగతి తెలిసిందే.

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌గా బుర్హన్ వనీ ఉన్నప్పుడు ఆయన యువకులపై బలమైన ప్రభావాన్ని వేశాడు. వనీ ప్రభావంతో చాలా మంది యువకులు మిలిటెన్సీలో చేరారు. అప్పుడు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. 2016లో వనీని ఎన్‌కౌంటర్‌లో చంపేశాక.. ఉగ్రవాదం తోకముడుస్తుందనే అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. వనీ తర్వాత అంతటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు రియాజ్ నాయికూ అని జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్‌పీ వాయిద్ తెలిపారు. రియాజ్ నాయికూ ఒక లెక్కల మాస్టర్. 2012లో ఉగ్రవాదిగా మారాడు. మారినప్పటి నుంచీ ఎప్పుడూ పెద్దగా వెలుగులోకి రాలేడు. టాప్ టెర్రరిస్టు యాసీన్ ఇట్టూ మరణం తర్వాత 2017లో రియాజ్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌గా లో ప్రొఫైల్ ఉన్న రియాజ్ ఎంపికవడంపై చాలా మంది నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి రియాజ్.. టెక్నికల్ అంశాలపై మంచి అవగాహన ఉన్నదని, అరుదైన అనుభవం, చాకచక్యంగా వ్యవహరించే శైలి అతనిది అని 2017లోనే ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ రిపోర్టు ఇచ్చింది. అందుకే రియాజ్ నాయికూ మరణం ఇప్పుడు ముందడుగుగానే భావిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్‌గా సుదీర్ఘ కాలం కొనసాగిన రియాజ్ తలపై 12 లక్షల రివార్డు ఉన్నది. రియాజ్ హతమవ్వడం.. ఉగ్రసంస్థకు పెద్ద దెబ్బేనని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

Tags: jammu kashmir, riaz naikoo, hizbul mujahideen, encounter

Next Story

Most Viewed