మరో 3 నెలలు లోన్స్‌పై మారటోరియం

by  |
మరో 3 నెలలు లోన్స్‌పై మారటోరియం
X

ముంబయి: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఆదాయం లేక సతమతమవుతున్న రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చల్లటి కబురు చెప్పింది. రుణాలపై మరో మూడు నెలలు మారటోరియాన్ని పొడిగిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అన్నిరకాల టర్మ్‌లోన్లకు మారటోరియం వర్తిస్తుంది. దీనివల్ల చిన్నవ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది. మార్చి 23న అర్ధరాత్రి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ రుణాలపై మూడు నెలల మారటోరియం విధించింది. మే 31తో ఈ గడువు ముగుస్తుండటంతో మళ్లీ మారటోరియం పొడిగింపు ప్రకటన చేసింది. శుక్రవారం ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ యోజన కింద రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. కొవిడ్-19 సంక్షోభంతో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుండటం, లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అన్ని వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆగస్ట్ 31, 2020 వరకు వర్తిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రుణాల కాల పరిమితి, చెల్లింపుల షెడ్యూలు, తిరిగి చెల్లింపు తేదీలన్నీ మరో మూడు నెలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక‌వ్యవస్థ కుదేలైంది. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తాం. అంతర్జాతీయంగా వాణిజ్యం 32 శాతం వరకు తగ్గింది. ఎగుమతులు, దిగుమతులను పెంచే చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఇప్పటికే రెండుసార్లు మీడియా సమావేశం నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ మొదటి సమావేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకున్నారు. రెండో సమావేశంలో కొవిడ్-19 వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరికొన్ని చర్యలు ప్రకటించారు.

వడ్డీ రేట్ల తగ్గింపు

ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులు అందుబాటులో ఉంచడం కోసం రెపోరేటును తగ్గించినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఇందుకోసం రెపోరేటును 4.40 నుంచి 4 శాతాని(40 బేసిస్ పాయింట్లు)కి తగ్గించారు. రివర్స్ రెపోరేటును 3.35 శాతానికి తగ్గించారు. రెపో‌రేటు తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు అందిస్తే ఈఎంఐలు మరింత చౌకగా మారుతాయన్నారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 3.7 శాతం పెరుగుదలతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడిందన్నారు.

విదేశీ మారక నిల్వలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు 9.2 బిలయన్ డాలర్లు పెరిగాయని, మే 15 నాటికి 487 బి.డా.కు చేరుకున్నాయని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఎగుమతుల్లో క్షీణత 60.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం కష్టంగా మారిందని, లాక్‌డౌన్ నిబంధనలపైనే ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందన్నారు. రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు తప్పవన్నారు.

ఉత్పత్తి క్షీణత

సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై మార్చి, ఏప్రిల్ నెలల్లో తీవ్ర ప్రభావం పడిందని, కరోనా దెబ్బకు మార్చిలో పారిశ్రామికోత్పత్తి 17 శాతం తగ్గినట్లు తెలిపారు. ఎన్నడూ లేనంత క్షీణత వల్ల తయారీ రంగం కార్యకలాపాలు 21 శాతం తగ్గాయని చెప్పారు. పారిశ్రామికోత్పత్తి 6.5 శాతం క్షీణించిందన్నారు. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం తదితర వాటికి డిమాండు పడిపోయిందని పేర్కొన్నారు. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించడం కోసం ఎగుమతి రుణాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు పొడిగించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.



Next Story