స్వయంకృతాపరాదం.. ఆ ఇద్దరు కలెక్టర్లకు హైకోర్టు పనిష్మెంట్

by  |
స్వయంకృతాపరాదం.. ఆ ఇద్దరు కలెక్టర్లకు హైకోర్టు పనిష్మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడిన ప్రభుత్వ అధికారులకు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు కలెక్టర్లు, ఒక ఆర్డీవోలకు విధించిన శిక్షలను ఖరారు చేసింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మూడు నెలల జైలుశిక్ష, రెండువేల రూపాయల జరిమానా, పిటీషనర్‌కు రూ. 25 వేలు చెల్లించాలని జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. ఆర్డీవో జయచంద్రారెడ్డికి నాలుగు నెలల జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఉల్లంఘనలకు పాల్పడ్డారని దాఖలైన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తిపై శిక్షలు ఖరారు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను వీరు ధిక్కరించారని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్ళేందుకు ఆరు వారాల గడువు ఇచ్చిన బెంచ్ అప్పటివరకు తీర్పు అమలును ఆపివేయవచ్చని స్పష్టం చేసింది.



Next Story