రూ. 2,000 వరకు ధరలు పెంచిన హీరో మోటోకార్ప్!

by  |
hero
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వాహన వినియోగదారులకు కంపెనీలు ధరల పెంపుతో షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కార్ల తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా, ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు సైతం అదే బాటలో వెళ్తున్నాయి. దేశీయ దిగ్గజ టూ-వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్ 2022, జనవరి నుంచి తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ నుంచి ఈ పెంపు నిర్ణయం అమలవుతుందని కంపెనీ తెలిపింది.

గత కొంతకాలంగా వాహన తయారీలో కీలకమైన విడిభాగాల వ్యయం పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. తాత్కాలిక కాలానికి ఈ పెంపు తప్పదని, బైక్, స్కూటర్ మోడల్‌ని బట్టి దాదాపు రూ. 2,000 వరకు ధరలు పెరుగుతాయని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే హీరో మోటోకార్ప్ రూ. 3,000 వరకు తన ద్విచక్ర వాహనాల ధరలను పెంచింది. కాగా, మరో టూ-వీలర్ కంపెనీ కవాసకీ కూడా జనవరి నుంచి తన అన్ని మోటార్‌సైకిళ్ల ధరలు రూ. 6,000-7,000 మధ్య పెంచుతున్నట్టు గురువారం వెల్లడించింది.

Next Story

Most Viewed