గుండెకు ఉందో మెదడు… చూడండి త్రీడీ మ్యాపు

by  |
గుండెకు ఉందో మెదడు… చూడండి త్రీడీ మ్యాపు
X

శరీరంలోని అన్ని అవయవాలు మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ అధీనంలో పనిచేస్తాయని మనం చిన్నపుడు సైన్సు పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే గుండె విషయంలో ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది. గుండెను ప్రాథమికంగా మెదడు నియంత్రించినప్పటికీ దానికంటూ ప్రత్యేకంగా వేరే మెదడు ఉందని చాలా మందికి తెలియదు. ఈ మినీ మెదడుని వైద్యపరిభాషలో ఇంట్రాకార్డియాక్ నర్వస్ సిస్టం (ఐఎన్‌సీ) అని పిలుస్తారు. ఇది బయటి తరంగాల సంగ్రహించి, గుండె దానంతట అదే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొట్టుకునేలా చేస్తుంది. జబ్బులు లేని మంచి ఆరోగ్యం కావాలంటే ఈ ఐఎన్‌సీ బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే దీని నిర్మాణక్రమం పనితీరు గురించి వైద్యశాస్త్రవేత్తలకు కూడా పెద్దగా తెలియదు. ఇదొకటి ఉంటుందని తెలుసుగానీ, ఏ నరం ఏ పని చేస్తుంది? గుండెను రక్షించడంలో ఇది ఎలాంటి మెకానిజం అనుసరిస్తుందనే విషయాలు తెలియవు.

అందుకే మొదటిసారిగా థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐసీఎన్ మీద పరిశోధన చేసి దానికి సంబంధించిన వివరణాత్మక త్రీడీ మ్యాప్‌ను రూపొందించారు. ఈ త్రీడీ మ్యాప్ వల్ల న్యూరాన్లతో నిర్మితమై ఉన్న ఐసీఎన్ పూర్తి నిర్మాణం తెలిసింది. అంతేకాకుండా దీని వల్ల న్యూరాలజీ, కార్డియాలజీ రెండు శాస్త్రాలు మిళితమై కలిసి పనిచేసే దారి ఏర్పడిందని పీహెచ్‌డీ స్కాలర్ జేమ్స్ ష్వాబర్ తెలిపారు.

ముందుగా దీన్ని ఒక ఎలుక గుండెను మ్యాప్ చేయడం ద్వారా మోడల్ రూపొందించారు. దీని కోసం వారు రెండు విధానాలను పాటించారు. నైఫ్-ఎడ్జ్ స్కానింగ్ మైక్రోస్కోపీతో ముందు ఎలుక గుండెను ఫొటోలు తీశారు. తర్వాత మొత్తం 7,50,000 ఫొటోలను ఒక్కటిగా కలిపి 3డీ మ్యాప్ తయారు చేశారు. తర్వాత రెండో విధానంలో లేజర్ క్యాప్చర్ మైక్రోడిసెక్షన్ ద్వారా ఒక్కో న్యూరాన్ జీన్ కోడ్‌ని గుర్తించి, మ్యాపులో ఆయా స్థానంలో లింకు అయ్యేలా సెట్ చేశారు. అంతేకాకుండా ఈ మ్యాప్ విషయంలో లింగ బేధాన్ని కూడా వారు గమనించినట్లు పరిశోధకురాలు శిరీష ఆచంట అన్నారు. దీన్ని మరింత లోతుగా పరిశోధిస్తే కేవలం మగవారిలో మాత్రమే గుండె జబ్బులు ఎందుకు వస్తాయనే విషయాన్ని తెలుసుకుని తగ్గించే అవకాశం దొరుకుతుందని ఆమె చెప్పారు. త్వరలోనే వారు మానవ గుండెకు దగ్గరి పోలికలు ఉండే పంది గుండెను కూడా ఈ విధానంలో పరిశోధనలు చేసి ఐసీఎన్ త్రీడీ మ్యాప్ రూపొందించనున్నట్లు శిరీష చెప్పారు. అలాగే వారు సృష్టించిన త్రీడీ మ్యాప్ కేవలం ఐసీఎన్ గురించి తెలుసుకోవడానికి ఒక దారిని మాత్రమే చూపించిందని, దాన్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు చేయనున్నట్లు శిరీష వివరించారు.



Next Story