టీకా అందరికీ అవసరం లేదు.. మాస్క్ తప్పనిసరి : డీహెచ్‌

by  |
టీకా అందరికీ అవసరం లేదు.. మాస్క్ తప్పనిసరి : డీహెచ్‌
X

‘‘వ్యాక్సిన్ కేవలం వ్యక్తికి మాత్రమే రక్షణ ఇస్తుంది.. ఇది వేయించుకున్న తర్వాత కూడా మాస్కు ధరించాల్సిందే.. ఇతరులకు వైరస్ అంటించకుండా ఉండడానికి మాస్కును వేసుకోవడం ఒక సామాజిక బాధ్యత.. టీకా వేసుకున్నవారికి వైరస్ సోకకపోవచ్చు.. పాజిటివ్ నిర్ధారణ కాకపోవచ్చు.. కానీ వారికి వ్యాపించిన వైరస్ ఇతరులకు అంటుకునే ప్రమాదం ఉంది.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అవసరం లేదు’’ అని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అంతేకాదు.. పిల్లలు, గర్భిణులు వ్యాక్సిన్ చేయించుకోవచ్చా..? దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఏమైనా ప్రమాదమా..? ఎన్ని డోసులు వేసుకుంటే వ్యాక్సిన్ పనిచేస్తుంది..? అనుభవం లేని వారు వ్యాక్సినేషన్ చేస్తే ఏమౌతుంది..? రాష్ట్రంలో ఎంతమందికి ఎన్ని దశల్లో టీకా ఇవ్వనున్నారు.. వంటి సందేహాలన్నింటికీ ‘దిశ’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో :

వ్యాక్సిన్ వేసుకోవడంతో వైరస్ బాధ తప్పినట్లేనా?

వ్యాక్సిన్ ద్వారా వ్యక్తికి మాత్రమే రక్షణ లభిస్తుంది. ఆ వ్యక్తికి వైరస్ సోకకపోవచ్చు. పాజిటివ్ బారిన పడకపోవచ్చు. కానీ ఆ వ్యక్తుల శరీరాల్లోకి వైరస్ వెళ్లకుండా నిరోధించదు. వైరస్ వెళ్లిన తర్వాత దాన్ని ఎదుర్కొనే శక్తి వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. కానీ సమాజానికి వైరస్ వ్యాప్తి ప్రమాదం తప్పినట్లు భావించలేం.

ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనా?

అవసరం లేదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నావారు, వృద్ధులు, నిత్యం వైరస్ బారిన పడే పరిస్థితుల్ల పనిచేసే వైద్యారోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది.. ఇలాంటివారు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిజానికి వైరస్‌ను తట్టుకునే శక్తి సహజసిద్ధంగా ఏర్పడాలి. జనాభాలో కనీసంగా అరవై శాతం మందికి వ్యాక్సిన్ వేస్తే కొంతకాలానికి ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ (సామూహిక నిరోధక శక్తి) వస్తుంది. కానీ ఇప్పుడే అంతదూరం ఆలోచించాల్సిన అవసరం లేదు.

వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కు ధరించాలని ఎందుకు చెప్తున్నారు?

వ్యాక్సిన్ వ్యక్తికి సంబంధించిన అంశం. కానీ మాస్కు మాత్రం సమాజం కోసం వ్యక్తికి వైరస్ సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ను వేయించుకుంటాం. కానీ ఏదో ఒక రూపంలో వైరస్ మన దేహంలోకి వెళ్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వైరస్‌తో కొట్లాట జరుగుతుంది. చివరకు మనది పైచేయి అవుతుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనలో ఉన్న వైరస్ మాస్కు ధరించకపోతే ఎదుటి వ్యక్తులకు సోకే అవకాశం ఉంది. మనకు తెలియకుండానే మనం వైరస్ క్యారియర్లుగా ఉంటాం. అందువల్ల ఎదుటివారి కోసం మాస్కు ధరించాల్సిందే. ఇది ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత.

పిల్లలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలా?

అవసరం లేదు. ఒక్కో దేశానికి పిల్లలు అనే పదానికి ఒక్కో రకమైన నిర్వచనం ఉంది. మన దేశంలో కొన్ని అంశాల్లో 14 ఏళ్లు, మరికొన్ని అంశాల్లో 18 ఏండ్లుగా ఉంది. వ్యాక్సిన్ విషయంలో 18 ఏళ్ల వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు.

గర్భిణులు వేయించుకోవచ్చా?

అవసరం లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ మీద పరిశోధనలు జరిగి అందుబాటులోకి తీసుకొచ్చిన మొత్తం ప్రక్రియలో ఎక్కడా గర్భిణుల మీద ప్రయోగాలు జరగలేదు. అందువల్ల వారికి వ్యాక్సిన్ వేయించకపోవడం మంచిది. వ్యాక్సిన్ సంస్థలు కూడా గర్భిణుల విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్ ఎలా అమలవుతుంది?

దేశంలో ఎవరికి వ్యాక్సిన్ వేయాలన్నా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరగాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఆ సాప్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకోవాలి. త్వరలోనే అందుకు ఒక మొబైల్ యాప్, వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుంది. నిర్దిష్ట మార్గదర్శకాలు కూడా వస్తాయి. ఎవరికి వారు అందులో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత వారి మొబైల్ నెంబర్‌కు వచ్చే మెసేజ్ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాలి.

యాభై ఏళ్లు దాటినవారికి ఎలా?

రాష్ట్ర జనాభాను, అందులో వయసువారీ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని తొలి దశలో 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని అంచనా వేశాం. అందులో యాభై ఏళ్లు దాటినవారూ ఉన్నారు. అయితే ఇందుకు ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నాం. అందులో పేర్కొన్న వయసును బట్టి సాఫ్ట్‌వేర్‌లో పేరును నమోదుచేస్తాం. దానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ఉంటుంది.

ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మళ్లీ ఎప్పుడు వేసుకోవాలి?

ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఎంత కాలానికి ఒకసారి వేసుకోవాలనే దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు వేయించుకున్నవారు మళ్లీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్దిష్టంగా పరిశోధనలు జరిగిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది.

రెండు డోస్ లకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?

మొదటి డోస్ వేసుకున్న తర్వాత కనీసంగా 28 రోజుల గ్యాప్ ఉండాలి. మొదటి డోస్ వేసుకున్నప్పుడే రెండో డోస్ ఏ రోజున ఏ సమయానికి వేసుకోవాలో మెసేజ్ వస్తుంది. రెండు డోస్‌లు వేసుకుంటే మాత్రమే వ్యాక్సిన్‌ పూర్తి ఫలితం ఉంటుంది.

ఆరు నెలల తర్వాత మళ్లీ వేసుకునే అవకాశం ఉందా?

దేశంలోనే తొలిసారిగా ఒక సాఫ్ట్‌వేర్ సాయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. దేశం మొత్తానికీ ఒకటే సాఫ్ట్‌వేర్. దేశంలో ఎక్కడ వేయించుకున్నా అందులో నమోదవుతుంది. ఒకసారి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ వివరాలన్నీ అప్‌డేట్ అయి ఉంటాయి. రెండోసారి వేయించుకునే ఛాన్స్ లేదు.

ఒకసారి వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?

వైరస్ బారిన పడి తగ్గిపోయిన తర్వాత మళ్లీ పాజిటివ్ నిర్ధారణ అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వేయించుకోవడం వీలవుతుందా?

జ: పాజిటివ్ వచ్చిన తర్వాత నెగెటివ్‌గా తేలి క్వారంటైన్ పీరియడ్ ముగిసేంతవరకు వ్యాక్సినేషన్ కుదరదు. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వరు.

జ్వరం, అనారోగ్యం లాంటివి ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

వ్యాక్సిన్ తీసుకోడానికి ఇలాంటి అనారోగ్యాలేవీ ఇబ్బంది కాదు. పరగడుపున వెళ్లాలి, పథ్యం చేయాలి.. ఇలాంటివేమీ వర్తించవు. అనుమానాలు అవసరం లేదు.

అలెర్జీ గురించి ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?

సాధారణంగా ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చేటప్పుడు పెన్సిలిన్ లాంటివి పడతాయా, ఎలర్జీ ఉందా అని వైద్యులు తెలుసుకుంటూ ఉంటారు. కానీ వ్యాక్సిన్‌కు అలాంటివి ఉండవు. రియాక్షన్ వచ్చినట్లయితే వెంటనే పక్కనే ఉన్న వైద్యులు స్పందించి తగిన చికిత్స అందిస్తారు. భయం అవసరం లేదు.

ప్రేవేటులో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?

ప్రస్తుతానికి మొదటి డోస్ పూర్తయ్యేంత వరకు ప్రైవేటు మార్కెట్‌లో విక్రయాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రంలో మొదటి దశ ఎంతమందికి ఇవ్వాలనేదానికి వేర్వేరు లెక్కలు ఉన్నాయి. మన రాష్ట్రం విషయంలో బహుశా జూలై వరకూ ప్రైవేటులో విక్రయాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లభ్యం కావడం ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు దీనిపై స్పష్టత వస్తుంది.

ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయో తెలిసేది ఎలా?

ప్రస్తుతానికి రాష్ట్రంలో వెయ్యి వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. భవిష్యత్తులో ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, బస్తీ దవాఖానా తదితర చోట్ల వ్యాక్సిన్ వేయించుకునే సౌకర్యం లభిస్తుంది.

పోలియో చుక్కల తరహాలో కరోనాకు కూడా ఇకపైన పుట్టగానే వేసే అవసరం ఉంటుందా?

ఇప్పటి పరిస్థితుల్లో ఇంకా మనం ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ రూపంలో ఉండే వ్యాక్సిన్‌ను మాత్రమే తయారుచేసుకున్నాం. ఇంకా చుక్కల మందు రూపంలో రాలేదు. పైగా పుట్టగానే పోలియో తరహాలో కరోనాకు కూడా వ్యాక్సిన్ వేయాల్సిన వైద్యపరమైన అవసరం ఇప్పటికీ ఏర్పడలేదు. మోడెర్నా అనే సంస్థ చుక్కల మందు తయారీపై దృష్టి పెట్టింది. కొన్నేండ్ల తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.

వ్యాక్సినేషన్‌పై తగిన అనుభవం లేకపోతే సక్సెస్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మన దేశంలో మొత్తం 14 రకాల వ్యాక్సినేషన్లు మనం ఇస్తున్నాం. కేవలం వైద్యారోగ్య సిబ్బంది మాత్రమే కాక ‘ఆశా’ వర్కర్లు, ఏఎన్ఎం నర్సులు కూడా గ్రామాల దాకా ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తీసుకెళ్తున్నారు. మనకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. ఈ అనుభవమే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.

Next Story

Most Viewed