మరో హెల్త్ కేర్ వర్కర్ మృతి.. వ్యాక్సినే కారణం?

126

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని, ఆందోళన పడాల్సిన అవసరంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు భరోసా కల్పిస్తుండగానే రాష్ట్రంలో మరో హెల్త్ కేర్ వర్కర్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో ‘108’ అంబులెన్సు సర్వీసు డ్రైవర్ వ్యాక్సిన్ వేసుకున్న ఒక రోజు తర్వాత మృతి చెందగా ఆదివారం ఉదయం వరంగల్ అర్బన్ జిల్లాలోని శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మరో మహిళా హెల్త్ కేర్ వర్కర్ మృతిచెందారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల వివరాల ప్రకారం 42 ఏళ్ళ అంగన్‌వాడీ మహిళ ఈ నెల 22వ తేదీన వ్యాక్సిన్ వేయించుకున్నారని, 24వ తేదీ తెల్లవారుజామున మృతి చెందారని పేర్కొన్నారు. మృతికి వ్యాక్సినే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇద్దరు చనిపోయినట్లయింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఒక ‘ఆశా’ వర్కర్ మృతి చెందారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోవడంతో అదే కారణమనే అనుమానాలు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అంగన్‌వాడీ మహిళ మృతికి దారితీసిన కారణాలపై జిల్లా స్థాయి ఏఈఎఫ్ఐ (ఆప్టర్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్) కమిటీ సభ్యులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించే వివరాలతో వాస్తవ కారణాలు వెలుగులోకి రానున్నాయి. జిల్లా స్థాయి ఏఈఎఫ్ఐ కమిటీ అధ్యయనం తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీకి రిపోర్టు వస్తుందని, దీన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర కమిటీకి పంపుతామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.00 గంటలకు వ్యాక్సిన్ తీసుకున్న ఆ మహిళ 24వ తేదీ తెల్లవారుజాము వరకు బాగానే ఉన్నారని, ఆమె మృతికి వ్యాక్సిన్ కారణం కాకపోవచ్చని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

గతంలో నిర్మల్ జిల్లా డ్రైవర్ విషయంలోనూ వ్యాక్సిన్ కారణంగానే చనిపోయినట్లు తొలుత అనుమానాలు వచ్చినా టీకా తీసుకున్న తర్వాత సాయంత్రం వరకూ డ్యూటీలోనే ఉండి మరుసటి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అతనితోపాటు వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలుగానీ, సైడ్ ఎఫెక్టులుగానీ రాలేదు. కేవలం డ్రైవర్ ఒక్కరే చనిపోవడంతో వ్యాక్సిన్‌కు ముడిపెట్టలేమని వైద్యులు తేల్చిచెప్పారు. ఇప్పుడు శాయంపేట అంగన్‌వాడీ మహిళా కార్మికురాలి విషయంలో పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి నిర్దిష్టంగా దారితీసిన కారణాలు వెల్లడి కానున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..