మజాక్ చేస్తున్నారా.. TRS లీడర్లకు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్

by  |
మజాక్ చేస్తున్నారా.. TRS లీడర్లకు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా మారిందక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. పెట్టని కోటగా ఉన్న మండలాల్లో కింది స్థాయి నుంచి నిర్మాణం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి తయారు కావడం టీఆర్ఎస్ పెద్దలకు మింగుడు పడకుండా తయారైంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలు ఫీల్డ్‌లోకి వస్తే కానీ, అర్థం కాకపోవడంతో మంత్రి షాక్‌కు గురయ్యారు. చివరకు ఆయనే ఆ మండలంపై ప్రత్యేక దృష్టి సారించారట.

అసలేం జరిగింది…?

హుజురాబాద్‌లో ఎన్నికల కోలాహాలం ప్రారంభం కాగానే అన్ని కోణాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి కొన్ని మండలాల్లో మాత్రం పట్టు దొరకడం లేదు. రంగనాయక్ సాగర్ కేంద్రంగా మంత్రి హరీష్ మంత్రాగం చేసి నియోజకవర్గంలోని అన్ని వర్గాలను పార్టీకి అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. అంతా బావుందనుకున్న హరీష్ రావు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకొని ముందుగా పార్టీ నాయకుల్లోనే మార్పు తీసుకురావాలని గుర్తించారు. దీంతో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం వీణవంక మండల కేంద్రంలో పర్యటించినప్పుడు ప్రాక్టికల్‌గా ఎదురైన అనుభవాలతో మంత్రి హరీష్ రావు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరిని మీటింగ్ లోనే లేపి మరీ క్లాస్ తీసుకున్నారు. కరీంనగర్, వరంగల్‌లో ఉంటూ రోజు వీణవంకకు వచ్చి వెళ్లడం కాదు ఇక్కడే మకాం పెట్టి పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. దీంతో సదరు ప్రతినిధి షాక్‌కు గురై వీణవంకకు షిఫ్ట్ అయ్యే పనిలో పడ్డారు.

మిస్ గైడ్ చేశారా..?

అధికార పార్టీలోనే ఉంటూ మనం చాలా పట్టు పెంచుకోగలిగాం అంటూ కథలు చెప్పుతూ కాలం వెల్లదీసిన లోకల్ లీడర్స్ వ్యవహారం గుట్టును మంత్రి హరీష్ రావు గుర్తించడంతో కొంతమంది నాయకుల నోళ్లలో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఆయా కుల సంఘాల ప్రతినిధులను, కార్మిక, కర్షక, యూత్ వింగ్స్ అంటూ రంగనాయక్ సాగర్‌కు తీసుకొచ్చి పార్టీలో చేర్పించుకుని వారికి అన్ని విషయాలు వివరించినా ఏ మాత్రం ఫలితం కనిపించకపోవడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన సొంత మండలంలో పార్టీ వీక్‌గా ఉండడం ఏంటన్న విషయం గురించి ఆరా తీసి చివరకు క్షేత్ర స్థాయి పర్యటనలో అసలు నిజం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు దీనికి విరుగుడు మంత్రం మొదలు పెట్టారు. స్థానిక నాయకులు కూడా లోకల్‌లో ఉండకపోవడంతోనే పార్టీకి, ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని గుర్తించిన మంత్రి హరీష్ రావు ప్రతి ఒక్క నాయకుడు కూడా వీణవంకలోనే ఉండాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.



Next Story