అప్పుల పాలైన సర్పంచులపై అధికారుల వేధింపులు..

by  |
అప్పుల పాలైన సర్పంచులపై అధికారుల వేధింపులు..
X

దిశ, వర్థన్నపేట: ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచులు ప్రజలకు సేవ చేయడంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రజల దీవెనలతో ముందుకు వచ్చిన గ్రామ ప్రథమ పౌరులకు నిరాశే మిగిలింది. వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం స్థానిక ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని దాదాపు10గ్రామాల సర్పంచులు బహిష్కరించినట్లు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుంకరి సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సర్పంచులపై అధికారుల వేధింపులు ఇంకెన్ని రోజులు అంటూ గళమెత్తారు. గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నచిన్న సమస్యలను తెరపైకి తెచ్చి చెక్ పవర్ రద్దు చేస్తామంటూ, పదవిలో నుండి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక పక్క గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే, మరో పక్క అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని అన్నారు. సంవత్సరం క్రితం చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లు రాలేదన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న బిల్లులు రికార్డయిన తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులకు అప్పులు పుట్టక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. అధికారులు మాపై పెత్తనం చెలాయిస్తూ బిల్లులు రాకుండా అడ్డంకులు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed