అర ఎకరం పక్షులకే!

by  |
అర ఎకరం పక్షులకే!
X

దిశ, వెబ్‌డెస్క్: రోబో 2.0 సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర పక్షిరాజుగా మారడానికి ముందు ఒక ఆర్నిథాలజిస్ట్. అంటే పక్షుల మీద పరిశోధనలు చేసే శాస్త్రవేత్త. అందుకే సెల్‌ఫోన్ సిగ్నళ్ల కారణంగా అవి నాశనం అవుతున్నాయని తెలిసి వాటిని నిషేధించాలని కోరుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ విఫలమవుతాడు. మరీ అంతలా కాకపోయినా పక్షి కనిపించినపుడు కాసిన్ని నీళ్లు, కొన్ని ధాన్యపు గింజలు వేసి వాటి మీద ప్రేమ చాటుకుంటున్న పక్షిప్రేమికులు నిజజీవితంలోనూ చాలా మంది ఉన్నారు. కానీ పక్షుల కోసం ఏకంగా తన భూమిలో అరఎకరాన్ని అంకితం చేసిన వ్యక్తులు మాత్రం చాలా అరుదు. అలాంటి ఒక వ్యక్తి గురించిన వివరాలు మీకోసం!

కోయంబత్తూరుకు చెందిన 62 ఏళ్ల ముత్తు మురుగన్‌కు పక్షులంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా పిచ్చుకలు అంటే ఆయనకు చాలా ఇష్టం. కేవలం పక్షులను చూడటానికే ఆయన పొలానికి వెళ్లేవారు. ఈ వయస్సులో ఆయనకు మానసిక ప్రశాంతతను అందిస్తున్న ఆ పక్షుల కోసం ఆయన ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అందుకే ఈ ఏడాది పక్షులకు ఒక అర ఎకరాన్ని అంకితమిచ్చారు. ఆ అరఎకరం స్థలంలో చిరుధాన్యాలు, గోధుమ పంటలు వేశారు. ఈ పంటలు పక్షులకు మాత్రమే. ప్రతి ఏడాది వ్యవసాయ పంటలో కొంత భాగాన్ని పక్షుల గింజల కోసం దాచే అలవాటున్న మురుగన్, ఈ ఏడాది ఇలా కొత్తగా ప్రయత్నించడానికి కారణం లేకపోలేదు. ఇంతకీ ఏంటా కారణం?

ఈ ఏడాది అందరికీ ఉన్న సమస్యే. వ్యవసాయదారుడైన మురుగన్‌కు కూడా ఇబ్బందులు తీసుకొచ్చింది. అదే కరోనా లాక్‌డౌన్. ఈసారి కరోనా కారణంగా వ్యవసాయం చేసినా కూడా పెద్దగా లాభం ఉండదని మురుగన్ ముందే గ్రహించారు. అందుకే తనకున్న భూమిలో అరఎకరం పక్షుల కోసం పంటలు వేసి, మిగతా భూమిలో తన పశుపక్ష్యాదుల కోసం గడ్డి పంటలు వేశారు. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. ముత్తు మురుగన్ నివసించేది రామలింగం కాలనీలో, కానీ ఆయన పొలం ఉండేది కులాథుపలాయంలో. మధ్యలో 15 కి.మీ.ల దూరం. కరోనా పరిస్థితుల్లో అంతదూరం వెళ్తూ వస్తూ వ్యవసాయం చేయడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మురుగన్ వివరించారు.

తన నిర్ణయానికి తగినట్లుగానే పక్షులు రావడం మొదలుపెట్టాయి. రోజూ 20 నుంచి 25 నెమళ్లు వస్తున్నాయని, వందల సంఖ్యలో పిచ్చుకలు వస్తున్నాయని మురుగన్ చెప్పారు. పక్షులను ఫొటోలు తీసుకునేందుకు వరుణ్ అలగర్ సురేంద్రన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను కూడా మురుగన్ ఆహ్వానించారు. ఎంతో కష్టపడితే, ఎదురుచూస్తే గానీ దొరకని పక్షుల ఫొటోలు మురుగన్ దయ వల్ల తాను చాలా సులభంగా క్యాప్చర్ చేయగలుగుతున్నట్లు వరుణ్ అంటున్నారు. తన ఇన్‌స్టాగ్రాం ప్రొఫైల్‌లో వరుణ్.. పక్షుల ఫొటోలను షేర్ చేస్తుంటారు. కేవలం పెద్దపులి, సింహం, ఏనుగుల మీదనే కాకుండా చిన్న జీవులైన పక్షులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని వరుణ్ అభిప్రాయపడ్డాడు.

Next Story

Most Viewed