పోతిరెడ్డిపాడు విస్తరణకు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే

by  |
పోతిరెడ్డిపాడు విస్తరణకు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే
X

దిశ, న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు చెన్నయ్‌లోని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిగి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను ప్రారంభించరాదని జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, హైదరాబాద్ ఐఐటీకి చెందిన నిపుణులు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెందిన సీనియర్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారని స్పష్టం చేసింది. నారాయణపేట బాపనపల్లికి చెందిన గవినోల్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బెంచ్ పై ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా అందదని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రావణ కుమార్ వాదిస్తూ, ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84కు విరుద్ధమైనదని, ఈ ప్రాజెక్టు కారణంగా శ్రీశైలం జలాల్లోని జీవరాశికి ప్రమాదం వాటిల్లుతుందని, పర్యావరణానికి సవాలుగా ఉంటుందని బెంచ్‌కు వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బెంచ్ నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని, దానిపై కోర్టు విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ప్రాజెక్టు పనులను ప్రారంభించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Next Story

Most Viewed