ఎన్నికలు వాయిదా వేయాలని గ్రాడ్యుయేట్స్ డిమాండ్

by  |
ఎన్నికలు వాయిదా వేయాలని గ్రాడ్యుయేట్స్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్స్​పోర్ట్ ​క్రెడిట్​ గ్యారెంటీ కార్పొరేషన్(ఈసీజీసీ) ఆఫ్ ​ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకీ పరీక్ష, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఒకే రోజు ఉండటంతో పట్టభద్రులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తే ఆ తేదీల్లో ఎన్నికలు నిర్వహించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసీజీసీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన రోజునే రాష్ట్రంలో రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఎలాగూ నోటిఫికేషన్లు ఇవ్వవు. కనీసం వచ్చిన అవకాశాన్ని సైతం సద్వినియోగం చేసుకోకపోతే ఎలా అని సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఈసీజీసీకి గ్రాడ్యుయేట్ చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసి ఓటు వేద్దామని అనుకున్నా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో ఉండటంతో ఓటు వేయడం కుదరదు. తెలంగాణలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉండటం వల్ల ఇతర జిల్లాల నుంచి ముందస్తుగానే నగరానికి చేరుకోవాలి. దీంతో వారు ఓటుకు దూరమయ్యే అవకాశముంది. పోలింగ్‌ను వాయిదా వేయాలని ఎలక్షన్​కమిషన్‌కు తెలియజేసేందుకు వెబ్‌సైట్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసినా ఆ నెంబర్లు కలవడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇవేమీ తమకు పట్టవన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఎన్నికలు వాయిదా వేస్తారా? లేదా?.. వాయిదే వేయకపోతే నిరుద్యోగులు పరీక్షకు వెళ్తారో? లేక పోలింగ్ కేంద్రాలకు వెళ్తారో వేచి చూడాలి.


Next Story

Most Viewed