ఆటో పరిశ్రమలో ఆ పథకానికి కఠిన నిబంధనలు

by  |
ఆటో పరిశ్రమలో ఆ పథకానికి కఠిన నిబంధనలు
X

దిశ, వెబ్‌డెస్క్: వాహన తయారీ రంగంలో పీఎల్ఐ పథకం పొందాలంటే ఇకపై కంపెనీలు కఠిన నిబంధనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కింద వాహన తయారీదారులకు ఆర్థిక రాయితీల కోసం అర్హత సాధించేందుకు కఠినమైన ప్రమాణాలను నిర్దేశించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. కొత్త నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచేదిగా ఉండనున్నాయి.

వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖ నిర్దిష్ట సంవత్సరంలో రవాణా చేసిన వస్తువుల నుంచి వచ్చే మొత్తం ఆదాయానికి బదులుగా బేస్ ఇయర్ నుంచి ఎగుమతుల ఆదాయ పెరుగుదల ఆధారంగా ప్రామాణిక నిర్వహణ విధానాలను అమలు చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా , బేస్ ఇయర్‌ను 2019-20 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి మార్చాలని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. అలాగే, పొరుగు దేశాలకు ఎగుమతుల దూరాన్ని 3 వేల కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం దేశీయంగా మారుతీ సుజుకి ఇండియా, హ్యూండాయ్ మోటార్ ఇండియా, ఫోర్డ్ మోటార్ ఇండియా కంపెనీలు కీలకమైన ప్యాసింజర్ వాహన ఎగుమతిదారులుగా ఉన్నాయి. బాజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు టూ-వీలర్ విభాగంలో కీలకమైన ఎగుమతిదారులుగా ఉన్నాయి. కాగా, పీఎల్ఐ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది నవంబర్‌లో స్థానిక తయారీని పెంచేందుకు, ఎగుమతులను మెరుగుపరిచేందుకు 10 రంగాల్లో పీఎల్ఐ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. వాహన తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో సహా ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ పథకం ద్వారా రూ. 57 వేల కోట్ల సబ్సీడీలను కేంద్రం అందించనుంది.

Next Story

Most Viewed