బయోటెక్నాలజీ హబ్​గా హైదరాబాద్

by  |
బయోటెక్నాలజీ హబ్​గా హైదరాబాద్
X

దిశ, న్యూస్​బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, ఈ పరిశోధనలు కొవిడ్-19పై మానవాళి పోరాటంలో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు ఆవశ్యమని గవర్నర్ తెలిపారు. జేఎన్​టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020’ అంశంపై ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్‌భవన్ నుంచి ఆన్​లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. కొవిడ్​ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, సైంటిస్టులు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్న నేపథ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్​గా ఎదుగుతున్నదన్నారు. భారతదేశం ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్​లో 20శాతం సాధిస్తుందని గవర్నర్​ వివరించారు. హైదరాబాద్ ‘ బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్​’గా ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్​లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని, కొవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. సైన్స్​లో మహిళా పరిశోధకులకు, ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటి ప్రిన్సిపల సెక్రటరీ జయేష్ రంజన్, యూనివర్సిటీ రెక్టార్ గోవర్థన్, మంజూర్ హుస్సేన్, కన్వినర్ ఉమ, అత్యాకప్లే, కౌసర్ జమీల్ ప్రసంగించారు.

Next Story

Most Viewed