సర్కార్‌కు సంకటం.. పంటల ప్రణాళికపై ప్లాన్ ఫెయిల్!

by  |
paddy crop
X

దిశ. తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడింది. వరి వద్దంటూ రాష్ట్రం, కొనుగోళ్లపై కేంద్రం.. ఎటూ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటికే పది శాతం సాగు దాటాల్సిన వరి ఇంకా వందల ఎకరాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు వ్యవసాయ శాఖ యాసంగి ప్రణాళిక ఇంకా కాగితాలకెక్కలేదు. అంతకు ముందు వానాకాలం సాగు సమయంలో ఒకేసారి రెండు పంటలకు విడుదల చేసిన ప్లాన్​ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఇదే సమయంలో వరి సాగు వద్దంటూ వ్యవసాయ శాఖ విడుదల చేసిన అవగాహన పత్రాల్లో సాగు సమయాలు పొంతన కుదరడం లేదు. పప్పు దినుసులు సాగు చేయాలంటూ సూచిస్తున్నా.. ఈ నెల 15 వరకే విత్తనాలు వేయాలని సూచించారు. కానీ పునాసా పంటల గడువు ఇప్పటికే దాటిపోయింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంలో పడింది.

పది జిల్లాలే టార్గెట్..​

రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటల్లో ప్రధానంగా వరిసాగు విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాలను ప్రభుత్వం గుర్తించింది. కానీ, ఈ జిల్లాల్లో ఏ పంటలు వేయాలనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి యాసంగిలో వరిసాగు సమయం మీదికొచ్చింది. రాష్ట్రంలో వరిపంట సాధారణ సాగు విస్తీర్ణం 34.01లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది యాసంగిలో 62 లక్షల ఎకరాలకు చేరింది. అందులో అత్యధికంగా వరిసాగు చేసిన జిల్లాల్లో పది జిల్లాలను గుర్తించి ఈ జిల్లాలను ప్రథమ ప్రాధాన్యత కింద చేర్చారు. ఒక్కో జిల్లాలో 2లక్షల ఎకరాలకు పైగానే వరి సాగు చేశారు.

2 లక్షల ఎకరాలలోపు వరిసాగు చేసిన జిల్లాలను ద్వితీయ ప్రాధాన్యత కింద చేర్చారు. ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించిన 10 జిల్లాల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. సూర్యాపేట జిల్లా తరువాత నల్లగొండ జిల్లాలో 4.56లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 3.91లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3.13లక్షల ఎకరాలు, ఖమ్మంలో 2.95లక్షల ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 2.92లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 2.76లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.76లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 2.55లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.13లక్షల ఎకరాలు వరిసాగుతో ప్రథమ ప్రాధాన్యత జిల్లాల జాబితాలో ఉన్నాయి.

కంట్రోల్ ఎలా..?

వరిసాగు ఎక్కువగా ఉండే జిల్లాలో పంటను కంట్రోల్​చేసి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తే కొంత మేరకు తగ్గే అవకాశాలున్నాయి. కానీ, వరిసాగును ఎలా కంట్రోల్​చేయాలనేదే సర్కారు ముందున్న ప్రశ్న. ఈ భూములన్నీ దాదాపుగా వరి సాగులో ఆరితేరి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నఫలంగా వాటిలో వేరే పంటలు వేస్తే దిగుబడులు కష్టమే. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రొత్సహించాలని చెప్పుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. వ్యవసాయ శాఖ గ్రామాలకు దూరమైనట్టే కనిపిస్తోంది. గ్రామాలకు వెళ్తే రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అటు రైతుబంధు సమితిలు ఉన్నా.. లేనట్టే. ప్రస్తుతం మేం సభ్యులం అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడా లేదు.

సంకటంలో సర్కారు..

ఏ పంటలు వేయాలనే అయోమయంలో రైతులు ఉంటే.. అంతకు మించి సర్కారు సంకటంలో పడింది. వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో పల్లి, శనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, మినుములు వేయాలంటూ చెప్పుతున్నా.. దానికి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికీ లేదు. ఏ ప్రాంతంలో ఎంత సాగు విస్తీర్ణం అనేది నేటికి కూడా అంతుచిక్కకుండానే మారింది.

సాగు సమయం దాటింది

ప్రత్యామ్నాయ పంటలుగా పల్లి, వేరుశనగ, ఆవాలు, ఆముదం వంటి పంటలు వేయాలంటూ రెండు రోజుల నుంచి వ్యవసాయ శాఖ ప్రత్యేక బ్రోచర్లతో ప్రచారం మొదలుపెట్టింది. కానీ, ఇక్కడే అసలు తప్పిదం బయట పెట్టింది. ప్రత్యామ్నాయ పంటలుగా చెబుతున్న పల్లి, వేరుశనగ, ఆవాలు, కుసుమ, ఆముదం పంటలను సాగు చేసే సమయం నవంబర్​15తోనే ముగిసిపోయింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఒప్పుకుంది. సూచించిన సమయం దాటి విత్తనాలు వేస్తే దిగుబడి మొత్తానికే ప్రమాదం. మరోవైపు పెసర, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న పంటల సాగు సమయం కూడా ఈ నెలాఖరు వరకే కీలకం. ఈ సమయం కూడా దగ్గర పడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా చూసిన రైతులు ఇప్పుడు వెంటనే భూములను సిద్ధం చేసుకోవడం కొంత కష్టమే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా విత్తనాలు వేయాలంటే ఇబ్బందులు పడాల్సిందే. దీనికి తోడుగా విత్తనాలు కూడా అందుబాటులో లేవు.

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పల్లి, నువ్వులు, సన్​ఫ్లవర్.. సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో.. పల్లి, నువ్వులు, వేరుశనగ, సన్​ఫ్లవర్. మహబూబ్​నగర్, వనపర్తి, గద్వాల, నాగర్​ కర్నూల్, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వేరుశనగ, సన్​ఫ్లవర్, పెసర, మినుములు వేయాలంటూ అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలనే అంశం మాత్రం తేల్చడం లేదు.

6.11 లక్షల ఎకరాల్లో పంటలు..

మరోవైపు రాష్ట్రంలో యాసంగి సాగు మొదలైంది. మంగళవారం నాటి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 6,11,875 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. దీనిలో వరి కేవలం 365 ఎకరాల్లో మాత్రమే వేశారు. అత్యధికంగా పొద్దుతిరుగుడు 2.52 లక్షలు, వేరుశనగ 1.86 లక్షలు, మొక్కజొన్న 55 వేలు, మినుములు 48 వేల ఎకరాలతో పాటుగా పెసర 5వేలు, సన్​ఫ్లవర్​ 7 వేలు, పలు రకాల ఫుడ్ క్రాప్స్ 23 వేలు, జొన్న 14 వేల ఎకరాల్లో సాగు పూర్తి చేశారు.

అత్యధికంగా నాగర్​ కర్నూల్ జిల్లాలో 1.49 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. కామారెడ్డిలో 57 వేలు, నిజామాబాద్‌లో 54 వేలు, వనపర్తిలో 52 వేలు, నిర్మల్‌లో 44 వేలు, ఆదిలాబాద్‌లో 35 వేలు, సిద్దిపేటలో 18 వేలు, సంగారెడ్డిలో 17 వేలు, మహబూబ్​నగర్​లో 20 వేలు, గద్వాలలో 27 వేలు, నారాయణపేటలో 14 వేల ఎకరాల్లో పంటలు వేశారు. ఇక అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 303 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 313 ఎకరాలు, మంచిర్యాలలో 623 ఎకరాలు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 941 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.



Next Story