ఫిర్యాదుల పెట్టె మళ్లీ వచ్చే..

by  |
ఫిర్యాదుల పెట్టె మళ్లీ వచ్చే..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కంటిమీద కనుకులేకుండా జీవిస్తున్నారు. నిత్యం భయంతో జీవిస్తూ, వైరస్ ఏ రూపంలో అంటుతుందో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని మూలంగా ప్రజల జీవన విధానంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు అందించే సేవలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా భౌతిక దూరం పాటిస్తూ సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వాధికారులు వినూత్నంగా అలోచన చేశారు. తమను కలిసేందుకు వచ్చే అర్జీదారులు నిరాశ చెందకుండా ఉండేందుకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ కేసుల దృష్టిలో పెట్టుకుని బాధితులను నేరుగా కలిసే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యాలయంలో మూడు పెట్టెలను తేదీల వారీగా తయారు చేసి ప్రత్యేక గదిలో భద్రపరుస్తున్నారు. అత్యవసరమైన దరఖాస్తులను మాత్రం స్కాన్‌ చేసి పంపించాలని కిందిస్థాయి అధికారులకు సూచిస్తున్నారు. దీనివల్ల ఫిర్యాదుదారులతో పాటు సిబ్బందికి రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అత్యవసరమైతే తమ దరఖాస్తులను పంపించేందుకు వీలుగా వాట్సాప్‌ నెంబర్లు, ఈమెయిల్‌ చిరునామాను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారికి దూరంగా ఉంటూనే ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నామని అధికారులు తెలిపారు.


Next Story