మళ్లీ నిరాశే.. ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కేసీఆర్ సర్కార్

by  |
government employees, PRC statement
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ బాలరిష్టాలు దాటడం లేదు. మార్చిలో ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్ రోజు రోజుకూ దూరమవుతూనే ఉంది. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు వస్తాయంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఏప్రిల్, మే నెలల్లో ఈ ఫైల్ సీఎం దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత జూన్‌లో పీఆర్సీ జీవోలు విడుదలయ్యాయి. దీంతో జూన్ నెల వేతనాల్లోనే పెరిగిన వేతనాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ వాయిదా వేశారు. ఆ తర్వాత సప్లిమెంటరీ శాలరీలుగా జూలై మొదటి వారంలో ఇస్తామని అధికారులు చెప్పుతూ వచ్చారు. కానీ సప్లిమెంటరీ శాలరీలకు కూడా సాధ్యం కాలేదు. సప్లిమెంటరీ శాలరీల కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురవుతోంది. సప్లిమెంటరీ శాలరీలు సాధ్యం కాలేదని, వచ్చేనెల పెరిగిన వేతనాలు ఇస్తామంటూ అధికారులు చెప్పుతున్నారు.

భలే సాకులు..!

వేతన సవరణపై ప్రభుత్వ పెద్దల నుంచి కుంటిసాకులు చెప్పుకుంటూ సాగదీస్తున్నట్లు ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెలలో విడుదల చేసిన పీఆర్సీ జీవోల్లో ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని, కానీ ఏప్రిల్, మే నెల ఏరియర్స్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఇస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో రెండు నెలల ఏరియర్స్ ఏదైనా పండుగ సందర్భాల్లో ఇస్తారని భావించారు. తాజాగా జూన్ నెల కూడా పాత వేతనాలనే అందుకున్నారు. దానికి ప్రధానంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవడం, సవరించిన వేతనాల ప్రకారం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం సాధ్యం కాదంటూ జూన్‌లో పాత వేతనాలు ఇచ్చారు. జూన్ నెల ఏరియర్స్‌ను సప్లిమెంటరీ శాలరీలుగా ఇస్తామని ఉద్యోగులకు సమాచారమిచ్చారు. దీనికోసం 12 జిల్లాల్లో దాదాపు ఆరేడు విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కానీ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో సాప్ట్‌వేర్ అప్‌డేట్ కావడం లేదని చేతులెత్తేశారు. ఈ నెల 15లోగా సప్లిమెంటరీ శాలరీలు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు తమ ఖాతాలను చెక్ చేసుకున్నారు. కానీ క్రెడిట్ కాలేదు. కాగా ఖజానాపై ఎంతో కొంత భారం తగ్గించుకునేందుకే ఈ సాకులు చెప్పుతున్నారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్.. ఇంకా ప్రాబ్లమే

సప్లిమెంటరీ వేతనాలపై ఆశలు వదిలేసుకున్న ఉద్యోగులు వచ్చేనెల పెరిగిన వేతనాలు వస్తాయా అనే సందిగ్ధంలో పడ్డారు. వాస్తవంగా పలు శాఖల్లో బిల్లులు రెడీ చేస్తున్నారు. పెరిగిన వేతనాల ప్రకారమే బిల్లులు చేస్తున్నా.. ఐఎఫ్ఎంఐఎస్ సాఫ్ట్‌వేర్ ఇంకా ఇబ్బంది పెడుతుందంటున్నారు. కొన్ని ఎస్టీఓల్లో ఇంకా అప్‌డేట్ కావడం లేదన్నట్టుగా ఎర్రర్ చూపిస్తున్నట్లు చెప్పుతున్నారు. దీన్ని త్వరగా క్లియర్ చేయాలని, లేకుంటే వచ్చేనెల కూడా పెరిగిన వేతనాలు కష్టమేనంటున్నారు.

Next Story

Most Viewed