కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం సర్క్యులర్

by  |
కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం సర్క్యులర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం సీజీహెచ్ఎస్ ఉద్యోగులకు ప్రైవేటు, కార్పొరేట్ ఉద్యోగులకు కరోనా చికిత్సకు నిర్దిష్ట ఛార్జీలను ఖరారుచేసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రుల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్దేశించిన ప్యాకేజీని కేవలం నగదు చెల్లించే పేషెంట్లకు మాత్రమే వర్తింపజేస్తూ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు సర్క్యులర్ జారీ చేసింది. బీమా సంస్థలకు వర్తించదని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినట్లు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి.

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల కరోనా ఫీజుల ప్యాకేజీ ఉత్తర్వులో బీమా కంపెనీల గురించి విడిగా ప్రస్తావించలేదు. నిర్దిష్టంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే అంశాన్ని మాత్రమే పేర్కొంది. కానీ ప్రైవేట్‌ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న కరోనా బాధితులు చాలా మంది ప్రభుత్వ ధరల ప్రకారమే చికిత్స చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బిల్లులు చెల్లించనున్నట్లు స్పష్టం చేశాయి. కొన్ని బీమా సంస్థలు కొన్ని ఛార్జీలను హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి రావని, నగదు చెల్లించాల్సిందేనని దబాయిస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్సు ఉన్నా ఫలితం లేదని పాలసీదారులు మొత్తుకున్నారు. ఈ కారణంగా ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.

రోగుల నుంచి లక్షలకు లక్షల రూపాయల్లో ఛార్జీలు వసూలు చేయడంపై కుప్పలు తెప్పలుగా విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు వైద్యారోగ్య మంత్రిని కలిసి ప్యాకేజీ ధరలను పెంచాల్సిందిగా కోరారు. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయినట్లు ప్రతినిధులు తెలిపారు. నగదు చెల్లించి సాధారణ వార్డుల్లో ఉండే రోగులకు మాత్రమే ఇది వర్తేంచేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రైవేట్‌ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న రోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు.


Next Story