వాహ్.. బోడ కాకరకు భలే డిమాండ్

by  |
వాహ్.. బోడ కాకరకు భలే డిమాండ్
X

దిశ ప్రతినిధి, మెదక్ : అటవీ కాకరకాయ లేదా బోడ కాకరకాయ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలకు మాత్రమే ఈ కాకరకాయలు లభ్యమవుతాయి. ఈ కాకరకాయకు ఎటువంటి మందులు పిచికారి చేయరు. అందుకే చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీని రేటు సైతం బాగానే ఉంటుంది. వీటి ధర కిలోకు రూ.200 వరకు పలుకుతున్నా కొనేందుకు చాలా మంది మక్కువ చూపుతారు. ఇందులో ఎన్నో ఔషద గుణాలుంటాయి.

మనం రోజూవారి తినే కూరగాయలు ఏదో ఒక మందుతో పండుతున్నవే. కానీ ఈ కాకరకాయలు మాత్రం తీగ ఆధారంగా ప్రకృతి సిద్ధంగా పండుతాయి. దీని వల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఉమ్మడి జిల్లాలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. గిరిజనులు జూలై, ఆగస్టు నెలలో వీటిని సేకరించి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. వీటి ధర ఎక్కువగా ఉండటం వల్ల గిరిజనులు రెండు నెలల పాటు వీటి సేకరణకు మొగ్గుచూపుతూ వీటిని అమ్ముతుంటారు. ఈ కాకర వల్ల మధుమేహం, గుండె జబ్బులను దూరమవడమే కాక.. అధిక బరువు, లివర్ సమస్యలతో బాధపడే వారికి ఇవి ఉపయోగకరం.

భలే గిరాకీ

ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్‌చెరు, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ పట్టణంలోని మార్కెట్లలో బోడ కాకరకాయకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ప్రత్యక్షంగా ఎంతో మేలు చేసే బోడ కాకరకాయ.. అధిక ధర పలుకుతున్నప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. వాస్తవానికి రుచిలో కొంచెం చేదు అనిపించే ఈ బోడ కాకరకాయ మలబద్ధకం సమస్యను, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Next Story