యాదాద్రికి పసిడి వరద.. భారీగా విరాళాలు

by  |
యాదాద్రికి పసిడి వరద.. భారీగా విరాళాలు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రికి పసిడి వరద పారుతున్నది. ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం దాతల నుంచి భారీగా బంగారం విరాళం వస్తున్నది. ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. అప్పటివరకు యాదాద్రి ఆలయ పున:ప్రారంభ తేదీ ఎప్పుడు? ఏ స్థాయిలో పున:ప్రారంభ ఏర్పాట్లు ఉండనున్నాయి? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. కానీ సీఎం కేసీఆర్ యాదాద్రిలో సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు సీఎం కేసీఆర్ పర్యటనపైన దృష్టి పెట్టిన వారంతా పసిడి విరాళం ప్రకటించడం వైపే పరుగు తీశారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థల అధిపతుల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా అందరూ బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

125 కిలోల బంగారంతో స్వర్ణ తాపడం

యాదాద్రి ప్రధానాలయంలోని విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం తిరుమలలో స్వర్ణ తాపడం చేసిన వారిని ఇప్పటికే సంప్రదించగా, అందుకు 125 కిలోలకు పైగా బంగారం అవసరమని తేల్చారు. ఈ బంగారం కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.65కోట్లు అవసరం కానున్నాయి. ఈ మహత్కార్యంలో భక్తులను భాగస్వామ్యులుగా చేయాలని సీఎం సంకల్పించారు. అన్ని గ్రామాల నుంచి వారికి తోచినంత మేర విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు అందుకున్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల అధిపతులు పోటీపడి బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. స్వర్ణ తాపడం కోసం వినియోగించే మేలిమి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నుంచే కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.

సీఎం కేసీఆర్ ప్రకటనతో..

యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం కల్వకుంట్ల కుటుంబం నుంచి 1 కిలో 16 తులాల బంగారం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ మొదటిగా ప్రకటించారు. అనంతరం ఒక్కసారిగా బంగారం విరాళాల వెల్లువ పోటెత్తిందనే చెప్పాలి. అదే వేదిక మీద ఉన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి 2 కిలోల బంగారాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం నుంచి కేజీ, నియోజకవర్గం నుంచి మరో కేజీ మొత్తం 2కిలోల బంగారం అందించనున్నారని, కావేరి సీడ్స్ అధినేత, కావేరి భాస్కర్ రావు కేజీ బంగారం, దామోదర్ రావు కేజీ బంగారం, చిన జీయరు స్వామి కేజీ బంగారం విరాళంగా ఇవ్వనున్నారని సీఎం కేసీఆర్ వివరించారు. అనంతరం మంత్రి హారిశ్ రావు సైతంకేజీ బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. వీరు మాత్రమే కాకుండా హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధిరెడ్డి 5 కిలోలు, ఎమ్మెల్సీ నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్‌లు తలా కేజీ బంగారాన్ని విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం గోపురానికి స్వర్ణ తాపడం కోసం అయ్యే ఖర్చు తానే భరింనున్నట్టు ప్రకటించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు 20 కేజీల 16 తులాల బంగారం విరాళంగా ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.


Next Story

Most Viewed