ఏసీబీలో ఫుల్ టెన్షన్.. ఆ డబ్బు, బంగారం ఎలా మిస్సయ్యాయ్.?

by  |
ఏసీబీలో ఫుల్ టెన్షన్.. ఆ డబ్బు, బంగారం ఎలా మిస్సయ్యాయ్.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో అదృశ్యమైన బంగారం, నగదు విషయంలో ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అవినీతి అధికారుల వద్ద సీజ్ చేసిన బంగారంలో సుమారు 15 తులాలు, రెడ్ హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటుండగా స్వాధీనం చేసుకున్న రూ. 2 లక్షలకు పైగా నగదు విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టుగా సమాచారం.

2009 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మాయం చేసి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టిందెవరూ అన్న విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం వేటు పడ్డ డీఎస్పీ ఒక్కడి ప్రమేయమే ఉందా.? ఇంకొందరు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారా అన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

పర్యవేక్షణ లోపమా..?

నిజామాబాద్ డీఎస్పీగా పని చేస్తున్న వేణు గోపాల్‌ను ఈ వ్యవహారానికి బాధ్యున్ని చేస్తూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సేఫ్ లాకర్లో పెట్టాల్సిన సీజ్డ్ ప్రాపర్టీ, ట్రాప్ కేసుకు సంబంధించిన కరెన్సీ సరిగానే ఉందా లేదా అన్న పర్యవేక్షణ చేయడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించారా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సింది ఎవరూ..? కోర్టుకు, ఉన్నాతాధికారులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యులెవరు అన్న విషయంపై ఏసీబీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

సేఫ్ కస్టడీలో ఉంచాల్సిన వీటిని కార్యాలయంలో భద్రపరచడం విచిత్రంగా ఉంది. సాధారణంగా నిత్యం పోలీసుల పహారాలో ఉంటుందన్న ఉద్దేశ్యంతో ట్రెజరీ కార్యాలయాల్లో ఇలాంటివి స్టోర్ చేస్తుంటారు. ట్రెజరీలు, పోస్టాఫీస్‌లకు చెందిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు సంబంధిత పోలీస్ స్టేసన్‌లో భద్రపరిచేవారు. కానీ కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో ఇలాంటి పకడ్బంధీ చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. భద్రత నడుమ సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నట్టయితే దారి మళ్లేది కావని స్పష్టం అవుతోంది.

చార్జ్‌షీట్ ఎప్పుడేశారు..

కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో గోల్డ్, ట్రాప్డ్ కేసు కరెన్సీ సీజ్ చేసిన కేసుల్లో అధికారులు చార్జ్‌షీట్ ఎప్పుడు వేశారు. వేసినప్పుడు ఆ కేసులకు సంబంధించిన వివరాలను సరిచూసుకోలేదా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. చార్జ్‌షీట్ వేసిన తరువాతే అవి మిస్సయితే కోర్టు పరిధిలో ఉన్న ప్రాపర్టీ అన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదో కూడా అర్థం కాకుండా పోయింది.

ఆఫీసులు సురక్షితమేనా..?

అవినీతి నిరోధక విభాగానికి చెందిన కార్యాలయాలు సురక్షితమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. స్టేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న డీజీ ఆఫీసు తప్ప రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కరీంనగర్‌లో మాత్రమే ప్రభుత్వ భవనం ఉంది. రాష్ట్రంలోని మిగతా చోట్ల అద్దె భవనాల్లో ఏసీబీ కార్యాలయాలు నడుస్తున్నాయి.

2019లో కరీంనగర్‌లో ప్రారంభించిన ఏసీబీ ఆఫీసు భవనంలో కూడా భద్రతా డొల్లతనం స్పష్టమవుతోంది. ఇక్కడ స్ట్రాంగ్ రూం కానీ, సేఫ్ లాకర్ కానీ లేకపోవడంతో ట్రెజరీ కార్యాలయంలో వీటిని భద్రపరుస్తున్నట్టుగా సమాచారం. సొంత భవనాలు కట్టినా సీజ్డ్ ప్రాపర్టీని సేఫ్‌గా ఉంచేందుకు అనుగుణంగా మాత్రం లాకర్లను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల్లో అయితే అన్నీ ప్రైవేటు బిల్డింగ్‌లే కావడంతో ఆయా చోట్ల ఏసీబీ కేసుల్లో సీజ్ చేసిన నగదు, బంగారాన్ని సేఫ్ చేసేందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఏది ఏమైనా కరీంనగర్ ఏసీబీ కార్యాలయం వ్యవహారం మాత్రం పోలీసు ఉన్నతాధికారుల ముందు ఎన్నో సవాళ్లను పెట్టిందన్నది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌.. మళ్లీ మోగనుందా..?

ఆపిల్‌.. చెర్రీ.. ఏ పండు కావాలి.. కోడ్ భాషలో వాట్సాప్ హైటెక్ వ్యభిచారం


Next Story

Most Viewed