అవసరమైన వారందరికీ టీకా వేయండి : రాహుల్ గాంధీ

by  |
అవసరమైన వారందరికీ టీకా వేయండి : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తు్న్న తరుణంలో టీకా అవసరమైన వారందరికీ వేయాలని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు, విదేశాలకు ఎగుమతులను నిలిపేయాలని సూచించారు. టీకా తయారీదారులకు సహకరించాలని, వారి టీకాల ఆమోద ప్రక్రయను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని కోరారు. కరోనా టీకా డోసుల కొరతతో రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన చరిత్ర భారత్‌కు ఉన్నది. కానీ, నేడు వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా దేశ జనాభాలో ఒక్క శాతం మందికి కూడా టీకా వేయలేదు. అధిక జనాభా గల ఇతర దేశాలూ చాలా వరకు పురోగతిలో ఉన్నాయి.

మనదేశంలో టీకా పంపిణీ ఇంత మందగమనంగా సాగితే 75శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. ఒకవైపు మనదేశంలో రాష్ట్రాలకే టీకాలు సరిపోవడం లేదు. కానీ, విదేశాలకు టీకా ఎగుమతులను ఎందుకు మొదలుపెట్టినట్టు? డోసుల కొరత ఉన్నదని రాష్ట్రాలడిగితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సంతృప్తికర సమాధానాలివ్వట్లేదు’ అని పేర్కొన్నారు. ‘టీకా తయారీదారుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహకరించండి. వ్యాక్సిన్ ఎగుమతులను వెంటనే నిలిపేయండి. టీకా ఆమోద ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ చేయండి. అవసరార్థులందరికీ టీకా వేయండి. సెకండ్ వేవ్‌ దాటికి చితికిపోతున్న వర్గాలకు నేరుగా ఆర్థిక సహాయం చేయండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed